ఏపీ బాటలో కేరళ 

30 Mar, 2020 04:08 IST|Sakshi

మలయాళీ సీమలో ఏపీ తరహా వలంటీర్ల వ్యవస్థ

కరోనా కట్టడికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న మన రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థను కేరళలోనూ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్‌ కూడా ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గమనార్హం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక విధాన నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్న విషయం విదితమే. ప్రభుత్వ పథకాల అమలుతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండేలా మన రాష్ట్రంలో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది. దీనిని గమనించిన కేరళ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.   

వలంటీర్ల నియామకానికి కేరళ నిర్ణయం 
- ఏపీలో 4 లక్షల మందికి పైగా వలంటీర్లు పింఛన్ల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నారు. కరోనా కట్టడిలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.  
- విదేశాల నుంచి వచ్చిన దాదాపు 30 వేల మందిని ఇంటింట సర్వే ద్వారా గుర్తించి వారందరినీ ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉండేలా చూస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు.  
- ఇంతటి బృహత్తర బాధ్యత నెరవేరుస్తున్న ఏపీ తరహా వలంటీర్ల వ్యవస్థను కేరళలోనూ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయించారు. 
- అక్కడ తక్షణమే 2,36,200 మంది వలంటీర్లను నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 
- ఆ రాష్ట్రంలో 941 పంచాయతీలు, 87 మున్సిపాలిటీలు, 6 నగరపాలక సంస్థలు ఉన్నాయి.  
- ప్రతి పంచాయతీకి 200 మంది, మున్సిపాలిటీకి 500 మంది, కార్పొరేషన్‌కు 750 మంది చొప్పున వలంటీర్లను నియమిస్తున్నారు. 
- 22 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. వెంటనే శిక్షణ పూర్తిచేసి విధుల్లోకి తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు