పబ్లిక్‌ వసూలు

1 Nov, 2018 13:53 IST|Sakshi
నగరంలోని కేశవరెడ్డి స్కూల్‌ యాజమాన్యం ఓ విద్యార్థి నుంచి రూ.400 వసూలు చేసిన రసీదు

పది పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూలు

విద్యాశాఖ ఆదేశాలను లెక్కచేయని ప్రైవేటు యాజమాన్యాలు

అదనపు వసూళ్లపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే విద్యార్థులను ఇబ్బందులకు   గురి చేస్తున్న వైనం

చోద్యం చూస్తున్న అధికారులు

కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న  ప్రైవేటు స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు ఓ విద్యార్థి. పబ్లిక్‌ పరీక్ష ఫీజు చెల్లించాలని స్కూల్‌ యాజమాన్యం చెప్పడంతో  ఆ విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి రూ. 125  ఇచ్చారు. కుదరదని వారి నుంచి రూ. 400 వసూలు చేశారు.  ఈ అదనపు ఫీజు వసూలుపై వారు తర్వాత డీఈఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు

నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలలో బుధవారపేటకు చెందిన చిరుద్యోగి కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్ష ఫీజు కట్టేందుకు వచ్చిన ఈ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి  రూ.1000 వసూలు చేశారు. ఫీజు  125 రూపాయలే కదా అని అడగగా ఫీజుతో పాటు  అన్ని  రకాల ఖర్చులుంటాయని స్కూల్‌ హెచ్‌ఎం సమాధానం చెప్పినట్లు తెలిపారు.

జిల్లాలో ఈ రెండు స్కూళ్లలోనే కాదు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా  పదోతరగతి విద్యార్థుల నుంచి  వసూలు చేస్తున్నారు.  

కర్నూలు సిటీ:  వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజుల చెల్లింపు  ప్రక్రియ మొదలైంది.   ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125  చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే  చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.  అయినా, జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు   నిర్ణీత ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్‌ చేసి చెప్పినా వారు ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.  

అదనపు వసూళ్లపై అడిగేవారేరీ?
జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 934 ఉన్నాయి. ఇందులో 431 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.  ఆయా విద్యాసంస్థల్లో పబ్లిక్‌ పరీక్షలకు సుమారు 30 వేల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వారి తల్లిదండ్రులు పరీక్షల ఫీజు రూ. 125 చెల్లించేందుకు స్కూళ్లకు  వెళ్లితే అదనంగా డిమాండ్‌ చేస్తున్నారు.  తాము నిర్ణీత పరీక్ష ఫీజులు మాత్రమే చెల్లిస్తామని చెబితే   అధికారులకు ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆయా స్కూళ్ల  హెచ్‌ఎంలు వాదిస్తున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్లదండ్రుల పిల్లలకు   ఏదో ఓ సాకు పెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని  కొంత మంది పేరెంట్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చూస్తాం...చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

 పరీక్ష  ఫీజు  రూ.125 మాత్రమే వసూలు చేయాలి
పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ నిర్ణయించిన రూ.125  మాత్రమే అన్ని పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేయాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే  ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నగరంలోని ఓ స్కూల్‌లో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు  ఫిర్యాదు అందింది. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటాం. అదనపు ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి.  – తహెరా సుల్తానా, డీఈఓ  

మరిన్ని వార్తలు