చేనేత కుటుంబాలకు చేయూత

17 Nov, 2018 12:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ఆత్మహత్య చేసుకున్న     చేనేత కుటుంబాలకు     వైఎస్సార్‌ సీపీ అండ

ఆర్థికంగా ఆదుకునేందుకు 19, 20 తేదీల్లో ధర్మవరంలో భిక్షాటన

వెల్లడించిన కేతిరెడ్డి     వెంకటరామిరెడ్డి

అనంతపురం, ధర్మవరం: భిక్షమెత్తయినా చేనేత కార్మికుల కుటుంబాల్ని ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతోనే చేనేత రంగం సంక్షోభంలో కూరకుపోయిందన్నారు. నెలకో చేనేత కార్మికుడు బలవన్మరణం పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తన నివాసంలో పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షుడు గడ్డం కుళ్లాయప్పలతో కలసి విలేకరలతో మాట్లాడారు. చేనేత రంగాన్ని నమ్ముకుని ధర్మవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది పొట్టచేత బట్టుకుని వలస వచ్చారన్నారు. ప్రస్తుతం వారంతా ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల  పరిస్థితి చాలా దుర్భరంగా తయారైందన్నారు. నెలకో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. గతంలో చేనేత కార్మికులకు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలనూ ఈ నాలుగున్నరేళ్లలో నిలిపివేసి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.

తన హయాంలో ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు, ఇతర సంక్షోభం ఎదురైనప్పుడు తానే చొరవ తీసుకుని ఆ రంగంలోని ప్రముఖులందరితో చర్చించి ఇబ్బందులు లేకుండా చేశానన్నారు. ఇప్పుడు చేనేత రంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోగా స్థానిక నాయకులకూ ఏమాత్రం అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కానీ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆత్మహత్యలపైనా రాజకీయం చేసి బుకాయించే ప్రయత్నం చేసిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ధర్మవరం పట్టణంలో పర్యటించి, ఆత్మహత్యలకు పాల్పడ్డ 15 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చి, ఆర్థిక సహకారం అందించామని గుర్తుచేశారు. ఆ తరువాత ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించిందని కానీ.. ఆ ప్రకటన ఇప్పటి వరకు అమలుకు నోచుకుకోలేదన్నారు. 

సోమ, మంగళవారాల్లో భిక్షాటన
చంద్రబాబు ప్రభుత్వం చేనేతలకు చేసిన మోసాన్ని వివరిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు భరోసానిచ్చేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ధర్మవరం పట్టణంలో భిక్షాటన చేయనున్నట్లు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. 2016 తరువాత 30 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే డెత్‌ సర్టిఫికెట్, ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకుని తమ కార్యాలయానికి రావాలని కోరారు. ఆసరా కోల్పోయిన చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు తాము భిక్షాటన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇబ్బందులు పడుతున్న ఆ చేనేత కుటుంబాల్ని ఆదుకునేందుకు దాతలందరూ ముందుకు రావాలని ఆయన అభ్యర్థించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ చందమూరి నారాయణరెడ్డి, నాయకులు కోటం ఆనంద్, గుర్రం రాజా, తొండమల రవి, చింతా యల్లయ్య, తేజ, శీలా రాయుడు, కాంతమ్మ, గంగాదేవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు