‘ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయండి’

25 May, 2020 20:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అఫ్ ఏపీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. ఇందు కోసం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఒక కమిటీ వేయాలన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక లేఖలో తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్టూడియో నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌లో స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాతలు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లు, డబ్బింగ్‌లు, రీ రికార్డింగ్‌లు, విజువల్ ఎఫెక్టులకు సంబంధించిన పనులు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. చిత్ర పరిశ్రమ విశాఖపట్నంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. (వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలు)

త​క్కువ బడ్జెట్ సినిమాలు కనీసం 16 వారాలు థియేటర్లలో ప్రదర్శించే విధంగా జీఓ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. చిన్న నిర్మాతలను ప్రోత్సహించడంలో భాగంగా 5వ షో వెంటనే థియేటర్లలో అమలు చేయాలని కోరారు. ఐదో షో మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలని చెప్పారు. సినిమా టికెట్ల‌ విధానంలో అవినీతిని పోగొట్టటం కోసం ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయలన్నారు. చిన్న సినిమాలు బతకటం కోసం మినీ థియేటర్లను గవర్నమెంట్ బస్‌స్టాండ్, మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లో కనీసం 200 థియేటర్లు కట్టించే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సినిమా థియేటర్‌లో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టు బెంచ్ టికెట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఇక పైరసీ చేసిన వారికి స్టేషన్ బెయిల్ కాకుండా నాన్‌ బెయిలబుల్ కేసు వర్తించేలా చట్టం తీసుకురావాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు