'బాహుబలి-2 టికెట్ల దోపిడీని ఆపండి'

28 Apr, 2017 06:37 IST|Sakshi
'బాహుబలి-2 టికెట్ల దోపిడీని ఆపండి'

హైదరాబాద్‌: బాహుబలి-2 ప్రదర్శిస్తున్న సినిమా థియెటర్‌ల వద్ద రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులను నియమించి  టికెట్ల మాఫియాపై తక్షణ చర్యలు తీసుకొని.. సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను వీక్షించుటకు అవకాశం కల్పించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వినర్‌, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు.

'బాహుబలి-2 సినిమా గొప్ప సాంకేతిక విలువలతో రాజహౌళితో పాటు చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నాలుగు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల భారతీయ సినిమా వైభవానికి ఒక మహోత్తర దినం. కానీ.. బ్లాక్‌ టికెట్ల మాఫియా మూలంగా ఈ సినిమా చూడాలనే సగటు ప్రేక్షకుడి ఆశకు గండి పడింది. అసలు ప్రేక్షకులు మేం ఎందుకు ఎక్కువ ధర చెల్లించి సినిమా చూడాలి? అని థియెటర్‌ యాజమాన్యంతో కొన్ని ప్రాంతాల్లో గొడవలు పడి పోలీస్‌ స్టేషన్‌ల వరకు వెళ్లారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో ఈ టికెట్ల మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతూ భారీ ఎత్తున ఎక్కువ ధరలకు విక్రయించడం ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజలు సహించలేక పోతున్నారు' అని కేతిరెడ్డి తెలిపారు.

'వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి బాహుబలి-2 టికెట్లు తీసుకున్నారని ప్రచార మాధ్యమాలలో తెలుపుతూ.. ప్రభుత్వం, రెవిన్యూ అధికారుల అండదండలు మాకున్నాయని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. బాహుబలి-2 సినిమా టికెట్లను ఎక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రభుత్వాని వచ్చిన లాభం ఏం లేదని, ట్యాక్స్‌ల రూపంలో వచ్చేది కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే అని అన్నారు. టికెట్ల మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఈ అధిక ధరల సంస్కృతి ఇలాగే కొనసాగితే ఈ మాఫియా త్వరలో రాబోయే స్పైడర్‌, డీజే చిత్రాలకు కూడా ఇదే విధమైన దోపిడీని కొనసాగిస్తారని, వీరికి వెంటనే అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు