దందాపై ఎమ్మెల్యే కేతిరెడ్డి కన్నెర్ర

12 Dec, 2019 09:48 IST|Sakshi
ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్ల పర్వం 

ప్రతిపనికీ రేటు ఫిక్స్‌ చేసిన దళారులు, దస్తావేజులేఖర్లు

అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశం

ధర్మవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గత టీడీపీ హయాంలో మొదలైన అవినీతి వసూళ్ల దందా నేటికీ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిష్టర్‌ అయిన డాక్యుమెంట్‌కు సెంటుకు ఒక రేటు, ఎకరాకు ఒక రేటు చొప్పన లంచం వసూలు చేస్తున్నారు. ఈ దందాలో రియల్టర్లు, బ్రోకర్లు, దస్తావేజులేఖర్లు, దళారులు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది కలసి పాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధి పేరుతో వసూళ్లు నిర్వహిస్తూ అవినీతికి తెర లేపడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కన్నెర్ర చేశారు. అక్రమార్కుల అంతు చూడాలని రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన అధికార యంత్రాంగం ఆరోపణలున్న దస్తావేజులేఖర్లు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిపైన కేసులు నమోదు చేశారు.

సాక్షి, ధర్మవరం: ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని టీడీపీ పాలనా కాలం మొత్తం ఆదాయ వనరుగా చేసుకున్నారు. అప్పట్లో రిజిస్ట్రేషన్‌ కావాలంటే టీడీపీ ప్రజా ప్రతినిధులకు సొమ్ము ముట్టజెప్పాల్సిన దారుణమైన పరిస్థితులు ఉండేవి. టీడీపీ నాయకులు ఏకంగా కార్యాలయంలో తిష్ట వేసుకొని దళారులుగా మారి దస్తావేజు లేఖర్లు, కార్యాలయ సిబ్బందితో కుమ్మకై డబ్బులు వసూలు చేసేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ముందు ఏకంగా ‘లంచం అడిగితే ఫిర్యాదు చేయండి’అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.. అవినీతికి పాల్పడేవారి వివరాలు అందించాలని ఫ్లెక్సీలో తన సెల్‌నెంబర్, ఉన్నతాధికారుల సెల్‌నెంబర్లు పొందుపరిచారు. ఈ పరిణామంతో కొంత కాలం అక్రమార్కులు స్తబ్దుగా ఉండిపోయారు.  

అక్రమార్జనకు కొత్త పంథా 
అక్రమార్జనకు అలవాటుపడిన వారు కొత్త పంథా ఎంచుకున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలకు నానా కొర్రీలు పెట్టడం రిజిస్ట్రేషన్‌ను కాలయాపన చేయడం మొదటగా చేస్తారు. దీంతో సదరు బాధితులు కార్యాలయం చుట్టూ తిరిగిన తర్వాత సదరు అక్రమార్కులు, దస్తావేజులేఖరుల ద్వారా లంచం డిమాండ్‌ చేస్తారు. లంచం విషయం ఎక్కడ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారోనని ఏకంగా ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రచారం చేశారు. దీంతో బాధితులు ఏం చేయాలో పాలుపోక కొంతకాలం లంచాలు ముట్టజెప్పారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్‌ 
అక్రమార్కుల నయా దందా గురించి కొంతమంది బాధితులు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన అక్రమార్కులపై కన్నెర్ర చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందాకు కారకులు ఎంతటి వారైన చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని సబ్‌రిజిస్ట్రార్, పోలీస్‌ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

అక్రమార్కులపై కేసులు 
సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందా సాగిస్తున్న 16మంది దస్తావేజు లేఖరులను, ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిని రెండు రోజలు క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలిసింది. అంతటితో ఆగకుండా ఆరు నెలలుగా ధర్మవరం సబ్‌రిస్టార్‌ కార్యాలయ పరిధిలో అయిన రిజిస్ట్రేషన్లను పరిశీలించి, ఆయా వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది.

మరిన్ని వార్తలు