బలిజలను దగా చేస్తున్న బాబు

13 Feb, 2019 12:53 IST|Sakshi
మాట్లాడుతున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

కాపీరాయుడును డిబార్‌ చేద్దాం

గత ఎన్నికల్లో బలిజలను బీసీల్లో చేరుస్తానని మోసం

ఇప్పుడేమో ఈబిసీ రిజర్వేషన్లంటూ కొత్త పల్లవి

చంద్రబాబును నమ్మితే నట్టేట మునగాల్సిందే..

బలిజల ఆత్మీయ సదస్సులో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

అనంతపురం, ధర్మవరం: గత ఎన్నికల్లో బలిజలను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంటరామిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బలిజ కళ్యాణ మంటపంలో బలిజ కులస్థులతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజ కులస్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేతిరెడ్డి నివాసం నుంచి సాగిన ఈ ర్యాలీ బలిజ కళ్యాణ మండటపం వరకు సాగింది. పెద్ద ఎత్తున బాణా సంచాలు పేల్చుతూ, పూలబాటలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో కేతిరెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, అదే నలభై సంవత్సరాల వయస్సున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను కాపీ కొడుతున్నాడన్నారు. ఈ కాపీరాయుడిని సమాజం నుంచి డిబార్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బాబును నమ్మితే నట్టేట మునగాల్సిందేనని, 600 హామీలతో గద్దెనెక్కిన ఆయన ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఇప్పుడు తిరిగి ఎన్నికల వేళ కొత్త హామీలు ఇస్తున్నాడన్నారు. కాపులను మభ్యపెడుతూ సీఎం పబ్బం గడుపుకుంటున్నాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ సమయంలో ఎందుకు బీసీలుగా గుర్తించలేదని ప్రశ్నించారు.

ఈబీసీ రిజర్వేషన్‌లో 5శాతం కాపులకంటూ కొత్త డ్రామా
ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఈబీసీ రిజర్వేషన్‌ కల్పిస్తే.. అందులో కాపులకు 5శాతం కోటా ఇస్తామంటూ కొత్త డ్రామాకు చంద్రబాబు తెరలేపారని కేతిరెడ్డి విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు ఇందులోకి వస్తారని, కొత్తగా ఆయన చేసిందేమీ లేదన్నారు. కేవలం కల్లబొల్లి మాటలతో ప్రజలందరినీ మభ్యపెడుతున్నాడు తప్ప, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన బాబుకు ఏ కోశానా లేదన్నారు. కాపు కార్పొరేషన్‌ రుణాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్ప అర్హులకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు.

కాపు సంక్షేమానికి రూ.10వేల కోట్లు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కాపు సంక్షేమానికి ప్రతి ఏడాది రూ.2 వేల కోట్లు చొప్పున 5ఏళ్లలో రూ.10 కోట్లు కేటాయిస్తామన్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ రుణాలు విరివిగా ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బలిజలు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు యంబా లింగన్న, శిరిపి పర్వతయ్య, తొండమల రవి, మాసపల్లి సాయి, గొట్లూరు మారుతి, సాగా శీనా,  లాయర్‌ చంద్రమౌళి, గుద్డిటి మురళి, సాగా శీనా, పెద్డిరెడ్డిగారి శ్రీనివాసులు, సండ్ర రామక్రిష్ణ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ తొండమల ఉమాదేవి, మాజీ కౌన్సిలర్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు