ఏపీ కేబినెట్‌: కీలక నిర్ణయాలకు ఆమోదం

4 Mar, 2020 17:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఉగాదికి సుమారు 26లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీపై సన్నద్ధత, ఓడరేవుల నిర్మాణం, బడ్జెట్‌, ఆర్థిక విధివిధానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రివర్గ భేటీ వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 43,101 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటి పట్టాను గతంలో మాదిరి కేవలం వారసత్వంగా అనుభవించేందుకు మాత్రమే కాకుండా ఒక నిర్దేశిత ఫార్మాట్‌లో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నాం. ఇంటి స్థలం పొందిన  లబ్ధిదారులు ఐదేళ్ల పాటు ఇళ్లు కట్టుకునేందుకు, లేదా వ్యక్తిగత అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు కల్పిస్తూ..ఐదేళ్ల తరువాత దాన్ని విక్రయించేందుకు హక్కు కల్పిస్తున్నాం. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రర్‌ హోదా ఇస్తున్నాం. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. యుద్ధ ప్రాతిపాదికన లేఅవుట్లు ఏర్పాటు చేసి, గ్రావెల్‌ రోడ్లు వేసి స్థలాలు ఇవ్వబోతున్నాం.ఈ కాలనీలను 'వైఎస్సార్‌ జగనన్న కాలనీ'లుగా నామకరణం చేయబోతున్నాం. చదవండి: కోవిడ్‌పై ఆందోళన వద్దు

ఎన్‌పీఆర్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నాం. గడిచిన మూడు మాసాల పైబడి దేశంలో ఉన్న అనేక కోట్ల మంది మైనారిటీ వర్గాల్లో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌పై భయాందోళనలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా మైనారిటీ వర్గాలు భయాందోళనలో ఉన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కలను ఆసరా చేసుకొని మమ్మల్ని డిటేషన్‌ క్యాంపులో పెడతారనే ఆందోళనలో చాలా మంది ఉన్నారు. వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకొని వారికెలాంటి భయందోళన లేకుండా వారిలో భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితమవుతాం. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కూడా నిలిపివేయాలని తీర్మానం చేశాం. కేంద్రాన్ని కూడా అడుగుతూ నిలిపివేస్తున్నాం. 

రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం, భావనపాడు  పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది అందరికి తెలిసిందే. దానిలో భాగంగా రామాయపట్నం పోర్టుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో, దాని అడ్డంకులు తొలగించడంలో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు ఉన్న విస్తృత నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపాం. పీపీపీ విధానంలో భోగాపురం పోర్టు నిర్మాణం కోసం టెండర్ల పక్రియలో అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన జీఎంఆర్‌ కంపెనీకి గతంలో ఇచ్చిన టెండర్‌ కండిషన్లలోనే వారికి ఇస్తామన్న 2,703 ఎకరాల్లో 2,200 ఎకరాలకు కుదిస్తూ మిగతా 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునేలా మార్పు చేశాం. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం. చదవండి: సామాన్యుడి సొంతింటి కల ఆయన ధ్యేయం

రాబోయే తొలకరిని దృష్టిలో పెట్టుకొని రైతుకు కావాల్సిన విత్తనాలను సేకరించి రైతు అవసరాల కోసం అందుబాటులో ఉంచేందుకు ఏపీ స్టేట్‌ సీడ్‌ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు ఆమోదం తెలిపాం.  

విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో పురోగతిలో ఉన్న 800 మెగా వాట్ల విద్యుత్‌ కేంద్రం, అలాగే కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను పూర్తి చేసేందుకు ఏపీ జెన్‌కో రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపాం. ప్రభుత్వం నుంచి వీటిని బ్యాంకు గ్యారెంటీ ఇస్తున్నాం. 
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గత ప్రభుత్వంలో టీడీపీ అనే రాజకీయ పార్టీకి కేటాయించిన రెండు ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను కొనసాగిస్తూ.. ఆ భూమిని రద్దు చేస్తున్నాం. 

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సుండిపెంట గ్రామ పంచాయతీ ఏర్పాటుకు పంచాయతీ రాజ్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ..అక్కడ నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు, 44 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, భూ ఆక్రమణలపై ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో లోకాయుక్తా, సీబీ సీఐడీ ద్వారా విచారణ చేయిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చాం. ఇప్పటికే సిట్‌ ఏర్పాటు చేశాం. అందులో జరిగిన అన్ని అక్రమాలను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ ప్రక్రియ పూర్తి చేసి చార్జ్‌సిట్‌ దాఖలు చేసేందుకు ప్రత్యేక ప్రక్రియ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు