‘తెలంగాణ’లో డీఎస్‌ది కీలకపాత్ర

3 Mar, 2014 03:26 IST|Sakshi

నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ :  తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటాల వెనుక డీఎస్ ఉన్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, అయితే రాష్ట్రం ఏర్పాటు కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని యాష్కీ ఆరోపించారు. ఇప్పుడు ఏ విధంగా విజయోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారంటూ సోనియాగాంధీపై గుజరాత్ ము ఖ్యమంత్రి నరేంద్రమోడి విమర్శలు చేయటం తగదన్నారు.

 ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని
 తెలంగాణ ఏర్పాటులో ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటిని తట్టుకుని తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని ప్రభుత్వ మాజీ విప్ అనిల్ పేర్కొన్నారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా ప్రజాభీష్టానికే మద్దతుగా నిలిచారన్నారు. తెలంగాణకు అడ్డుపడాలని బీజేపీ చూసిందని, తీరా ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ప్రజలు చిన్నమ్మను మరచిపోవద్దంటూ సుష్మాస్వరాజ్ మాట్లాడారని విమర్శించారు. డీఎస్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసేవారని ఎమ్మెల్సీ రాజేశ్వర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపించి పెద్ద నాయకుడిని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం
 తెలంగాణ చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలుపుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ నిజామాబాద్ నుంచే ప్రకటన చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 జిల్లాలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకుందామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ ప్రజ లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పీసీసీ కార్యదర్శులు సురేందర్, రత్నాకర్, సత్యం రాయల్‌వార్, పీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, నిజామాబాద్ ఏ ఎంసీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, మాజీ మేయర్ డి.సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు