హాస్టల్ ఇష్టంలేక.. రెండో అంతస్తు నుంచి..

28 Jun, 2015 16:41 IST|Sakshi
హాస్టల్ ఇష్టంలేక.. రెండో అంతస్తు నుంచి..

అనంతపురం ఎడ్యుకేషన్ : చదువంటే ఇష్టంలేక మొన్న అనంతపురం జిల్లా యాడికి మండలం పి. వెంగన్నపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉండడం ఇష్టంలేక గార్లదిన్నె కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 8వ తరగతి చదువుతున్న షాహిరా అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ అమ్మాయి శని వారం ఉదయం రెండో అంతస్తు నుంచి దూకింది. అదృష్టవశాత్తూ ప్రాణాపా యం తప్పింది.

కాలికి బలమైన గాయమైంది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థిని, ఆమె తల్లి భానూబీ తెలిపిన వివరాల మేరకు... గార్లదిన్నె మండలం మార్తాడు కు చెందిన బాబయ్య, భానూబీ దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కు మార్తె (సాహిరా) సంతానం. అనంతపురం నగరానికి వలసవచ్చిన బాబయ్య కుటుంబం పాతూరులో నివాసం ఉం టోంది. బాబయ్య వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. సాహిరా ఈసారి 8వ తరగతి.

ఇంట్లో ఉండి చదివించడం ఇబ్బందిగా ఉండడంతో హాస్టల్ ఉంటే బాగా చదువుకుంటుందని భావించారు. ఈ క్రమంలో గార్లదిన్నె కేజీబీవీలో వారం కింద చేర్పించారు. చేర్పించిన రోజే తాను ఇక్కడ ఉండలేనని తల్లిదండ్రుల వద్ద మొర పెట్టుకుంది. కొత్తగా అలానే ఉంటుందని, రెండు రోజులు గడిస్తే అలవాటవుతుందని చెప్పి తల్లిదండ్రులు వదలివెళ్లారు. ఆరోజు నుంచి షాహిరా కేజీబీవీలో ముభావంగా ఉండేది. ఈ క్రమంలో శనివారం ఉదయం రెండో అంతస్తు నుంచి కిందకు దూకింది.

 అసలు విషయం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన సిబ్బంది
 కాగా కేజీబీవీ సిబ్బంది అసలు విషయం కప్పిపుచ్చే యత్నం చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉతికిన బట్టలు ఆరవేసేందుకు వెళ్తే ప్రమాదం జరిగిందని అమ్మాయితో చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా సాయంత్రం వరకు సమాచారం అందించలేదు. అనంతపురం ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్న సమయంలో చేరుకున్న తల్లిదండ్రులకు కూడా ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

మీడియా బాధిత విద్యార్థినిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. తనకు అక్కడుండడం ఇష్టం లేదని అందుకోసమే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని చెప్పింది. కనీసం తల్లిదండ్రులకు కూడా అసలు విషయం చెప్పకుండా దాచడం వెనుక ఆంతర్యమేమిటో కేజీబీవీ సిబ్బందికే తెలియాలి.  ఇదిలా ఉండగా గార్లదిన్నె కేజీబీవీలో గతేడాది ఒక విద్యార్థిని విషద్రవం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి కూడా ప్రాణాలు నుంచి బయటపడింది.

మరిన్ని వార్తలు