కేజీహెచ్‌ కిటకిట

2 Oct, 2018 07:56 IST|Sakshi
మా రిపోర్టులు ఏమయ్యాయి బాబూ..ఒక్కసారి చూడరూ..

విశాఖపట్నం: జ్వరాలతో నగరం విలవిలలాడుతోంది. దీంతో కేజీహెచ్‌కు రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఓపీ వద్ద రోగులు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఉదయం వెళ్తే మధ్యాహ్నం వరకూ క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓపిక లేనివాళ్లు అక్కడే కూర్చుండిపోతున్నారు. వైద్యుల పరీక్షల అనంతరం మందుల కోసం  ఇబ్బందులు తప్పడం లేదు. గంటల కొద్దీ క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం కేజీహెచ్‌కు వేలాది మంది వైద్యం కోసం తరలివచ్చారు.

ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని కేజీహెచ్‌ సోమవారం కిటకిటలాడింది. వ్యాధులు ప్రబలుతుండడంతో పాటు ఒడిశా నుంచి కూడా రోగులు రావడంతో ఏ వార్డు చూసినా రద్దీగానే కనిపించాయి. శని, ఆదివారాల్లో సేవలు తగ్గిపోవడం, మంగళవారం గాంధీ జయంతి నేపథ్యంలో వైద్యులు అందుబాటులో ఉంటారో ఉండ రో అని చాలామంది రోగులు సోమవారమే ఆస్పత్రికి వచ్చారని సిబ్బంది చెప్పారు. రక్తపరీక్షల నివేదికలు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12గంటల లోపే తీసుకోవాల్సి ఉండడంతో ఆయా ప్రాంతాలు కిటకిటలాడా యి. మందులిచ్చే గది వద్దా చాంతాడంత క్యూ కనిపిం చింది. ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులుండడం ఇక్కడ సర్వసాధారణమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇద్దరికీ రెండు సెలైన్లు సిద్ధం చేయడం కనిపించింది. బాలింతలు, దివ్యాంగులు, గాయాలపాలైన వాళ్లూ.. ఇలా కేజీహెచ్‌లో జనం భారీగా ఉన్నారు. పారిశుద్ధ్య లోపం, స్ట్రెచర్లు లేకపోవడంతో రోగులు నడుచుకుంటూ రావడం సరేసరే..   

మరిన్ని వార్తలు