మహనీయుడు..ఖాదర్‌ లింగ స్వామి 

14 Jul, 2019 08:54 IST|Sakshi

సాక్షి, కౌతాళం(కర్నూలు) : మానవుడు ఆరాధిస్తున్న భగవంతుడు ఏ ఒక్క మతానికి చెందినట్లు కాదని, మతం అనేది మనిషి మనిషికి మధ్యనే కాని మనసుకు కాదని నిరూపించిన మహనీయుడు శ్రీజగద్గురు ఖాదర్‌లింగ స్వామి. చరాచర జీవకోటి రాశులకే మూల సూత్రమైన పరమేశ్వరుడినే మెప్పించి భక్తుల్లో మతసామరస్యాన్ని చాటారు. మండల కేంద్రమైన కౌతాళంలో వెలిసిన దర్గాకు ఎంతో విశిష్టత ఉంది. కులమతాలకు అతీతంగా దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు.

ఏటా ఖాదర్‌ లింగ స్వామి 315 ఉరుసును వైభవంగా నిర్వహిస్తారు. 14వ తేదీ (నేడు) స్వామి సమాధికి సుగంధ పానీయాలతో శుభ్రం చేస్తారు. 15న గంధం కార్యక్రమం, 16న ఉరుసు ఉత్సవం, 17న బుధవారం సఫ్‌రా (ప్రసాదం పంపిణీ), 18న జియారత్‌ వేడుక ఉంటుందని ధర్గా దర్మకర్త సయ్యద్‌ సాహెబ్‌పీర్‌ వుసేని చిష్తీ తెలిపారు. ఈ స్వామిని శ్రీజగద్గురు మహపురుష సయ్యద్‌–షా– ఖాదర్‌లింగస్వామి గా ఈ ప్రాంత వాసులతో నిత్యం కొనియాడబడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఖాదర్‌ లింగ, లింగ్‌బంద్, జగద్గురు ఖాదర్‌లింగస్వామి, ఖాదర్‌వలిగా పేరుగాంచారు. 

స్వామి చరిత్ర: 
పూర్వం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ పట్టణంలో కొలవైన అమినూద్దీన్‌ అలిఆలా షేర్‌ఏఖుదా వారికి హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌షా అబ్దుల్‌ ఖాదరి వుసేని చిష్తీ 12 ఏళ్లు శిష్యరికం చేశారు. గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో తమ మౌఢ్యాన్ని తొలగించి మతసామరస్యాన్ని చాటేందుకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాళానికి చేరుకున్నారు. అప్పట్లో ఆయన మెడలో లింగమూర్తిని ధరించడాన్ని ఈ ప్రాంతంలో ఉన్న శైవ మతస్థులు కొందరు అభ్యంతరం చెప్పారు.

భగవంతుడు ఎవరి సొంతం కాదని పరమేశ్వరుని ప్రతీక అయిన లింగంపై ఎవరికీ హక్కు లేదని వారితో వాదించారు. శైవ మతస్తులను సమావేశ పరిచి వారి మెడలో ఉన్న లింగాలను బావిలో వేసి వాటిని మరలా రప్పించి ధరిస్తానని, తాను అలా చేయని పక్షంలో గ్రామం వదలి వెళ్తానని చెప్పారు. ఈ ప్రయత్నంలో ఆయన శివున్ని మెప్పించి లింగాలను బావి నుంచి రప్పించారు.

అప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయనను ఖాదర్‌లింగ స్వామిగా పూజించడం ప్రారంభించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, ఐదుగురు కుమారులు. 315 సంవత్సరాల క్రితం గ్రామంలోనే సమాధి అయ్యారు. ఆయన వంశస్థులు అయిన ప్రస్తుత ధర్మకర్త సయ్యద్‌ సాహెబ్‌పీర్‌ వుసేని చిష్తీ ట్రస్టీగా ఉన్నారు.    

మరిన్ని వార్తలు