గంగారం.. ఇక సింగారం

5 Jan, 2015 03:33 IST|Sakshi
గంగారం.. ఇక సింగారం

‘సంసద్ ఆదర్శ్’ కింద ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంగారం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఆ గ్రామ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో జిల్లా యంత్రాంగం సహాయంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, మోడల్ గ్రామంగా తీర్చి దిద్ది ప్రధాని నరేంద్రమోదీని తీసుకువస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీ, రోడ్ల ఏర్పాటుతో పాటు పచ్చదనంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు సర్పంచ్ అధ్యక్షతన తొమ్మిది మందితో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు.
 - సత్తుపల్లి
 
 సత్తుపల్లి మండల కేంద్రం తర్వాత గంగారం గ్రామం అతివేగంగా పట్టణీకరణ వైపు పరుగుతీస్తోంది. ఇప్పటికే అక్కడక సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, దాసరి వీరారెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్, నాలుగు ప్రాథమిక పాఠశాలలు, సాయిస్ఫూర్తి డీఏవీ ఇంగ్లిష్ మీడియంలో స్కూల్‌తో విద్యారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గంగారం గుట్టపై 15వ గిరిజన బెటాలియన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
 
 గ్రామ స్వరూపం.. :
 గంగారం గ్రామపంచాయతీలో రామగోవిందాపురం, మేడిశెట్టివారిపాలెం అవాస గ్రామాలుగా ఉన్నాయి. ప్రకాష్‌నగర్‌కాలనీ, పాత హరిజనవాడ, జలగంనగర్, ఎస్టీ కాలనీ,  బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలు ఉన్నాయి. పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. జనాభా 5451, ఓటర్లు 3,378, బీసీలు 1790, ఎస్సీలు 700, ఎస్టీలు 550లు మంది ఉన్నారు. వందకుపైగా పూరిల్లు ఉన్నాయి. గ్రామంలో 800 ఎకరాల ఆయకట్టు ఉన్న చింతల చెరువు, వడ్లజగయ్యకుంట 20 ఎకరాలకు, రామగోవిందాపురం కుంట 30 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.
 
 సహకారం అందిస్తున్న ‘తాన్ల’...
 అలాగే గ్రామాభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని ‘తాన్ల’ సొల్యూషన్స్ అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి ముందుకు వచ్చారు. అందులో భాగంగా గ్రామంలోని సమస్యలను సంపూర్ణంగా తెలుసుకునేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదేళ్ల క్రితం సుమారు రెండు కోట్ల రూపాయలతో బీటీరోడ్లు, డ్రైయిన్లు, రోడ్ల పక్కన పచ్చని మొక్కలు నాటారు. ఇంకా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమస్యలను కిందిస్థాయి నుంచి తెలుసుకునేందుకు 34 మంది తో ఇంటింటి సర్వే చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనవంతు సహకారం అందించి సొంత గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో పెట్టేందుకే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 సమస్యలపై దృష్టి సారించరూ.. :
  గ్రామంలో దీర్ఘకాలికంగా సర్వే నంబర్ 133 ఆన్‌లైన్ కాక పోవడంతో ఈ పహాణీలు రాక రైతులు రుణాలకు నోచుకోలేక పోతున్నారు. భూముల క్రయ విక్రయాలు నిలిచి పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నారు.
  గ్రామంలో సమీపంలోని 16 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే రామగోవిందాపురం ఫ్లోరైడ్ ప్రాజెక్టు ఉన్నా.. గ్రామంలోని జలగంనగర్, ఎస్టీ కాలనీ, గురుభట్లగూడెం రోడ్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫ్లోరైడ్ రహితనీరు సరఫరా చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.
  మరుగుదొడ్లు సరిపడా లేక బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్‌కింద 150 మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో 40 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.
  హిందూ శ్మశాన వాటికలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖననం చేసేందుకు, కాల్చటానికి కూడా స్థలం లేక దొంగచాటున చెరువు గట్టులపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
  ముస్లిం శ్మశానవాటిక ఆక్రమణకు గురైంది. ఎన్నిసార్లు అధికారులు వినతులు పంపించినా పట్టించుకోవటంలేదని ఫిర్యాదులు ఉన్నాయి.
  డంపింగ్‌యార్డు లేక స్టేట్‌హైవే పక్కనే చెత్తా చెదారాలు వేసి కాల్చుతున్నారు. గురుబట్లగూడెం రోడ్‌లో మంచినీటిబోరు వద్ద చికె న్ వ్యర్ధాలు వేయటం వలన దుర్వాసన వెదజల్లుతోంది.
  స్టేట్ హైవేతో సహా.. అంతర్గత రహదారులైన గంగారం-రామానగరం, గంగారం-గురుభట్లగూడెం, ప్రకాష్‌నగర్‌కాలనీ - రామగోవిందాపురం రోడ్ల పక్కన డ్రైయినేజీలు లేక పోవటం రోడ్లపై తిరిగే పరిస్థితి నెలకొంది. గంగారం-గురుభట్లగూడెం జంక్షన్ వద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు నిలిచి ప్రజలపై పడుతోంది.
  ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో ఇళ్లు మంజూరులో జరిగిన అక్రమాలతో చాలా మంది నిరుపేదలకు పక్కా గృహాలు వచ్చే పరిస్థితి లేదు. సత్వరం విచారణ పూర్తి చేసే అర్హులైన లబ్ధిదారులకు పక్కాగృహాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
  సాయంత్రం వేళ్లల్లో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో బస్‌స్టాప్ సెంటర్‌లో రద్దీ నెలకొంటోంది. ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈవ్‌టీజింగ్ అరికట్టాలని, మోటారు సైకిళ్ల వేగ నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
   ఆటో స్టాండ్ లేకపోవటం వలన రోడ్డుపక్కనే నిలిపాల్సి రావటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
 
 అభివృద్ధికి చిరునామాగా నిలుపుతా.. :
 ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తున్నా.. సంసద్ ఆదర్శ కార్యక్రమంలో భాగంగా గంగారం గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా నిలుపుతా. జిల్లా యంత్రాంగం, మంత్రులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాను. ప్రధాన మంత్రి నరేంద్రమోడి మెచ్చుకునే వవిధంగగా గంగారం గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.          పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ
 
 
 చాలా అదృష్టంగా భావిస్తున్నా.. :
 ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంగారం గ్రామాన్ని దతత్త తీసుకోవటంతో చాలా అదృష్టంగా భావిస్తున్నా.. గ్రామ పెద్దల సహకారంతో అభివృద్ధివైపు పరుగులు పెడుతుంది. అన్ని మౌళిక సౌకర్యాలు కల్పించేందుకు ననా వంతు ప్రయత్నం చేస్తా.
 -కోటమర్తి రమేష్, సర్పంచ్, గంగారం
 

మరిన్ని వార్తలు