‘పోలవరం బాబుకు బంగారు బాతులాంటిది’

18 Dec, 2018 11:18 IST|Sakshi

40 ఏళ్ల రాజకీయ అనుభవంలో బాబు సాధించింది ఏమీలేదు

 జనవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన : కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, అమరావతి : నలభైఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఏం సాధించారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. తన బతుకంతా వాళ్లనీ, వీళ్లనీ విమర్శించడం తప్ప సాధించిందేమీ లేదని ఘటూ వ్యాఖ్యలు చేశారు. ఓటుకునోటు వంటి కేసుల్లో ఇరుక్కోని పక్క రాష్ట్రం నుంచి పారిపోయి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేం‍ద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును కేవలం దోచుకోవడం కోసమే నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు ఆయనకు బంగారు బాతులా మారిందని అన్నారు.

సమావేశంలో కన్నా మాట్లాడుతూ..  ‘‘చంద్రబాబు బతుకంతా ఇతరులను తిట్టడానికి సరిపోయింది. వట్టి గాలి మాటలు తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో అగ్రిగోల్డ్‌, భూకుంభకోణం, జన్మభూమి కమిటీ వంటి అనేక కుంభకోణాలు వెలుగు చుశాయి. చంద్రబాబు దురాగతాలను కప్పిపుచ్చడానికి ఓ వార్త ఛానల్‌ మాపై అనేక అరోపణలు చేస్తోంది. మీకు కుల పిచ్చి ఉంటే, వారిని కాపాడుకోండి. కానీ మాపై, ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు వార్తలను మాత్రం ప్రచురించకండి’’ అని అన్నారు.

‘‘రాఫెల్‌ విషయంలో కేంద్రంపై విమర్శలు చేసినవారంతా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో రాహుల్‌ గాంధీ రహస్య చర్చలు జరిపారు. మిమల్ని ప్రజలు క్షమించరు. జనవరి 6న నరేంద్ర మోదీ ఏపీ పర్యటకు వస్తున్నారు. గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. సభ ద్వారా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కల్ని భయటపెడుతాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు