కౌలు రైతులకు కొత్త చట్టం

31 May, 2017 06:35 IST|Sakshi
కౌలు రైతులకు కొత్త చట్టం

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450 కోట్లు కేటాయింపు
ఉత్తరాంధ్ర జిల్లాలకు అదనపు సబ్సిడీతో యంత్రాల సరఫరా
ఉత్తరాంధ్ర జిల్లాల ఖరీఫ్‌ కార్యాచరణ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి


అరసవల్లి (శ్రీకాకుళం): కౌలు రైతుల అవస్థలను పూర్తిగా తొలగించేలా త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు. కౌలు రైతులకు కల్టివేషన్‌ సర్టిఫికెట్‌ (సీవోసీ)ను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఖరీఫ్‌ వ్యవసాయ కార్యాచరణపై మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులకు అందించే సీవోసీ ప్రాతిపదికగా చేసుకుని బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సర్టిఫికెట్ల వల్ల అసలైన భూమి యజమానికి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా నిబంధనలుంటాయని స్పష్టం చేశారు.

యాంత్రీకరణ వ్యవసాయానికి రూ. 450 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నŠుట్ట మంత్రి చంద్రమోహనరెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేందుకు రైతాంగం కోసం రూ.450 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ఈ ఏడాది రూ. 24 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. అలాగే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల రైతులకు యంత్రాలు, పనిముట్ల సరఫరా విషయంలో, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే అదనంగా సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అవసరమైన, అనుగుణమైన యంత్రాలను ఆ ప్రాంతానికే సరఫరా చేసేలా ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఈ ప్రాంతంలో నీళ్లు, వనరులు ఎక్కవగా ఉన్నప్పటికీ దిగుబడులు తక్కువగా ఉంటున్నాయని, ఇందుకు తగిన కారణాలను అన్వేషించాలని  అధికారులకు సూచించారు. ఎన్టీఆర్‌ జలసిరి పథకం అమలుకు కనీసం 5 ఎకరాల విస్తీర్ణ నిబంధనలను తగ్గించి, కేవలం రెండు ఎకరాల భూములకు అమలయ్యేలా జీవో విడుదల చేశామని వివరించారు. వెబ్‌లాండ్‌ ద్వారా విత్తనాలను పంపిణీ చేసే విధానంలో వస్తున్న ఇబ్బందులను మరోసారి సమీక్షిస్తామన్నారు.
– ఎంపీఈవో పోస్టుల భర్తీకి చర్యలు

 రాష్ట్రంలో అదనంగా 211 ఎంపీఈవో పోస్టుల భర్తీ చేయనున్నామని మంత్రి సోమిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తిగా అవగాహన కల్పించి అధిక దిగుబడులు వచ్చేలా చేయాల్సింది అధికారులే అని, వీరంతా అంకిత భావంతో పనిచేయాలన్నారు. తిండి పెట్టే వాడికి సేవ చేసే భాగ్యం మీకు కలిగిందని.. సక్రమంగా విధులు నిర్వర్తించాలని హితవుపలికారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకునే విషయంలో రాజీ పడేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎటువంటి ఉత్తమ ప్రతిపాదననైనా పరిగణలోకి తీసుకుని వెంటనే ఈ మూడు జిల్లాలకే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోల్చితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో దిగుబడి శాతం తక్కువేనని , ఇందుకు కారణాలను తెలుసుకుని తగు ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచించారు. ఒకే ప్రాంతంలో ఒకరికి ఎకరానికి 50 బస్తాలు పండితే, అదే ప్రాంతంలో మరొకరికి 30 బస్తాలే పండటంపై అధికారులు, శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలన్నారు. అలాగే వ్యవసాయ శాఖాధికారులు మట్టి నమూనా శాంపిళ్లను తీసుకుని, కేవలం లెక్కల్లో చూపిస్తున్నారని, నిజానికి ఆ భూమిలో లోపాలను, సారవంతం చేసే విధానాలను  రైతులకు తెలియజేయడం లేదని మండిపడ్డారు. ఈ ఏడాది 70 శాతం యాంత్రీకరణ వ్యవసాయం చేయాలనే దృక్పథంతో పని చేయాలని సూచించారు.

 ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో దిగుబడి తక్కువ రావడానికి కారణాలేంటో రానున్న ఖరీఫ్‌కు ముందే ఆలోచనలతో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొందరు బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డాక్టర్లు, లాయర్ల వద్దే వందలాది ఎకరాలున్నాయని, దీంతో మిగిలిన వారంతా రెండెకరాల లోపు రైతులే అని, దీంతో పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ నీటితో పంట సాగు చేసేలా ఆలోచనలు చేయాలన్నారు. 2004కి ముందు ఉన్న రైతు సంఘాలను మళ్లీ ఏర్పాటు చేయాలని, తద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయం సాగు పెరుగుతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అంతకుముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ధనుంజయరెడ్డి, వివేక్‌ యాదవ్‌లు, ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరక్టర్లు ఆయా జిల్లాల్లో వ్యవసాయ శాఖ ప్రగతిని, చేపడుతున్న చర్యలను, స్థానిక పరిస్థితులను వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ ఎ.వి.రాజమౌళి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖరం, వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లు వ్యవసాయ శాఖపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి,  శ్రీకాకుళం జేడీఏ రామారావు పాల్గొన్నారు.

 రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది
జిల్లాలో రైతుకు పెట్టుబడులకు తగ్గట్లుగా దిగుబడి కన్పించడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, అవగాహనారాహిత్యం మరోవైపు ఇబ్బందులను గురిచేస్తున్నాయి. రైతు కూలీల కొరత, అధిక కూలీరేట్లు తదితర కారణాల వల్ల రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి పరిస్థితిలో యాంత్రీకరణ వినియోగాన్ని పెంచాలి. జిల్లాను ప్రత్యేకంగా చూసి నిధులను మంజూరు చేయాలి.
– బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఎమ్మెల్యే

దోమపోటు పరిహారం ఇచ్చేదెప్పుడు?
2014 సంవతస్రంలో వరిపంటకు సోకిన దోమపోటు కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఎప్పుడు ఇస్తారో అధికారులు చెప్పాలి. అలాగే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా చాలా మంది రైతులకు అందలేదు. సుమారు 31968 మంది రైతుల సమస్యలివి. ఆలోచించండి. ట్రెజరీల్లో ఉన్న సొమ్ము రైతుకు చేరడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలో చెప్పండి.. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పం దిస్తూ ఈ అంశం మళ్లీ రిపీట్‌ కాకుండా కలెక్టర్‌ సమక్షంలో ట్రెజరీ, వ్యవసాయ శాఖాధికారులు పరిహారాలను అందజేయాలని ఆదేశించారు. 2014 నాటి పరిహారం అందకపోవడంపై కలెక్టర్‌ ధనుంజయరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.                  
 – గౌతు శివాజీ, పలాస ఎమ్మెల్యే

చిన్న సన్నకారు రైతులకు ట్రాక్టర్లు ఇవ్వండి
శ్రీకాకుళం నియోజకవర్గంలో అధికంగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వీరికి సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేలా చర్యలు తీసుకోండి. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో యాంత్రీకరణ వినియోగం తప్పనిసరిగా మారింది. విద్యుత్‌ కనెక్షన్‌తో ఉన్న ఒక బోరుకు అదనంగా వేరొక బోరును తీసుకుంటే దానికి సోలార్‌ కనెక్షన్లు ఇవ్వమంటున్నారు. దీనిపై దృష్టి సారించండి. ఎకరాకి 50 బస్తాలు రావాలనే ధ్యేయం కంటే మన ఆరోగ్యం కోసమైనా సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహం మరింత పెంచితే బాగుంటుంది.
– గుండ లక్ష్మీదేవి, శ్రీకాకుళం ఎమ్మెల్యే

ఇదేం సమీక్ష !
ఖరీఫ్‌ –2017 వ్యవసాయ కార్యాచరణ–ప్రణాళిక సమీక్ష పేరుతో జరిగిన కార్యక్రమం ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు. ఖరీఫ్‌పై సమీక్ష అంటే వ్యవసాయ పరిస్థితులపై అధికారుల చర్యలు, అలాగే పంట దిగుబడులు పెంచేలా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేస్తారనే అధికారులు అనుకున్నారు. తీరా ఆరంభం నుంచి ఉపన్యాసాలు, ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికే వేదికగా తయారయ్యిందనే విమర్శలు వినిపిం చాయి. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కూడా ఒకింత అసహనానికి గురై ఎమ్మెల్యేలు మాత్రమే అభిప్రాయాలు చెప్పండని, అది కూడా తక్కువగానే మాట్లాడమని చెప్పారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఎక్కడ...!
వ్యవసాయ సమీక్ష కార్యక్రమం పేరిట అధికార పార్టీ ఎమ్మెల్యే ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖాధికారులు కాస్తా అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలు, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు ఫ్లెకీల్సలను ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

 రుణమాఫీ ఎక్కడ చేశారు?
రైతులు అన్ని విధాలుగా మోసపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై చెప్పిందొకటి..చేసిందొకటి...ఎవరికీ సక్రమంగా రుణమాఫీ చేయలేదని గట్టిగా చెప్పగలను. ఇంకా రుణమాఫీ జరగని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పంట దిగుబడులు తగ్గిపోవడానికి పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా అందకపోవడం మరో ప్రధాన కారణం. ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌ను రెండు దఫాలుగా ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇంకా అందక రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కష్టాల నడుమ పంటలకు ఎలా పెట్టుబడులు పెట్టగలరో చెప్పండి? దీనికి తోడు క్షేత్రస్థాయిలో రైతులకు అధికారుల నుంచి సరైన మార్గదర్శకాలు లేవు. ఎన్టీఆర్‌ జలసిరి పథకం ద్వారా బోర్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ, ఒక్క బోరు కూడా వేయలేదు. ప్రభుత్వం మాత్రం రైతుల కోసం అంతా చేసేస్తున్నాం అంటూ ప్రచారాలు మాత్రం చేçస్తుండడం హాస్యాస్పదంగా ఉంది.
                  – కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు