షర్బత్‌లతో జీసీసీ ఖుషీ

24 Feb, 2016 23:26 IST|Sakshi
షర్బత్‌లతో జీసీసీ ఖుషీ

ఇప్పటికే నన్నారీకి గిరాకీ
సరికొత్తగా మార్కెట్లోకి ‘మారేడు’

 
 విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కి షర్బత్‌లు ఆదరణ తెచ్చిపెడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఔషధ గుణాల నన్నారి (సుగంధిపాలు) షర్బత్‌కు అనూహ్య డిమాండ్ వచ్చింది. 2015లో 10 వేల నన్నారి బాటిళ్లను అమ్మాలనుకుంటే ఏకంగా లక్ష బాటిళ్లు అమ్ముడైపోయాయి. దీంతో అలాంటి ఔషధ లక్షణాలున్న మరో సమ్మర్ డ్రింకుకు జీసీసీ  శ్రీకారం చుడుతోంది. దానికి మారేడు (బిళ్వ) షర్బత్‌గా నామకరణం చేసింది. దీనిని ఈ నెల 29న రాజమండ్రిలో విడుదల చేయనుంది. మారేడు పండ్ల గుజ్జు నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ మారేడు షర్బత్‌లో మధుమేహం, డయేరియా, అల్సర్‌ను నయం చేయడంతోపాటు బరువును తగ్గించే గుణం ఉందని, మలబద్ధకాన్ని నివారించే లక్షణాలున్నాయని  చెబుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో మారేడు చెట్లు అధికంగా ఉన్నాయి. షర్బత్ తయారీకి అక్కడ నుంచి 50 క్వింటాళ్ల మారేడు పండ్లను జీసీసీ కొనుగోలు చేసి ఉంచింది. కిలోకు ఎనిమిది బాటిళ్ల మారేడు షర్బత్ వస్తుంది. చిత్తూరులో ఉన్న తేనె ప్రాసెసింగ్ యూనిట్‌లోనే నన్నారి షర్బత్ తయారవుతోంది. కొత్త మారేడు షర్బత్‌ను కూడా అక్కడే తయారు చేస్తున్నారు. త్వరలో రాజమండ్రి కంబాలచెరువులో ఉన్న తేనె ప్లాంట్‌లోనే ఈ షర్బత్‌ను తయారు చేయడానికి రూ.10 లక్షలు వెచ్చించి యంత్ర పరికరాలను ఆధునీకరిస్తున్నారు. ఇప్పటిదాకా నన్నారి, మారేడు షర్బత్‌లను ఏ ఇతర కంపెనీలు తయారు చేయడం లేదు. 750 మి.లీ. బాటిల్ ధరను రూ.100లుగా నిర్ణయించారు. నన్నారి కూడా ఇదే ధరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం రెండు లక్షల నన్నారి సీసాలు అమ్ముడవుతాయని జీసీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు