బాలుడి కిడ్నాప్.. సుఖాంతం

6 May, 2015 04:56 IST|Sakshi
బాలుడి కిడ్నాప్.. సుఖాంతం

కడప అర్బన్ : కడప నగరంలో మంగళవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన నిమ్మకంటి మల్లికార్జున కుమారుడు యశ్వంత్ (6) ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరాడు. జిల్లా ఎస్పీ డా.నవీన్ గులాఠి.. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. కడప కార్పొరేషన్‌లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిమ్మకంటి మల్లికార్జున, శ్రీవాణి దంపతులకు యశ్వంత్ (6), లక్ష్మి ప్రణీత (3)లు సంతానం. వారు మున్సిపల్ స్టేడియంలోని దత్తసాయి మందిర్ పక్కనున్న ఇంటిలో ఉంటున్నారు.

ప్రతిరోజు యశ్వంత్ బయట ఆడుకునే వాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. 9 గంటలప్పుడు గమనించగా బాలుడు ఎక్కడా కన్పించలేదు.అంతలో వీరి ఇంటిపక్కనుండే డ్రైవర్ పుల్లయ్య సెల్‌ఫోన్(98664 46732)కు అపరిచిత వ్యక్తి (సెల్ 9908348947) ఫోన్ చేశాడు. యశ్వంత్ అనే పిల్లాడిని రాజంపేట వైపు తీసుకువెళుతున్నామని చెప్పాడు. ఆలోపే మల్లికార్జున పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటంతో ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వచ్చాడు. డ్రైవర్ పుల్లయ్య, మల్లికార్జునతో అపరిచిత వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడించారు. కానిస్టేబుల్ మాట్లాడే ప్రయత్నం చేయగా అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తీవ్ర ఆవేదనతో యశ్వంత్ తల్లిదండ్రులు విలపించారు.

విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ సూచనల మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, అర్బన్ సీఐ సదాశివయ్య దర్యాప్తు ముమ్మరం చేశారు. పిల్లాడి ఫొటోలను వాట్సాప్‌లో అన్ని పోలీస్‌స్టేషన్‌లకు పంపించారు. ఈ నేపథ్యంలో తమను పోలీసులు వెంటాడుతున్నారని భావించిన కిడ్నాపర్లు బాలుడిని సాయంత్రం రాయచోటి బస్టాండు వద్ద వదిలి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత బాలుడిని గుర్తించిన రాయచోటి పోలీసులు కడపకు తీసుకువచ్చారు. ఎస్పీ ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు