20 ఏళ్లకు పట్టుబడిన మాయ‘లేడి’

25 Aug, 2019 11:02 IST|Sakshi
నిందితురాలు భాగ్యలక్ష్మి

20 ఏళ్ల క్రితం బాలుడిని అపహరించిన మహిళ

ప్రాంతాలు మారుస్తూ మనుషుల్ని ఏమార్చటం ఆమె స్టైల్‌

సాక్షి, చీపురుపల్లి: రెండు దశాబ్దాల క్రితం ఆ మాయ‘లేడీ’ ఓ బాలుడిని అపహరించింది. ఆ తరువాత ప్రాంతాలు మారుస్తూ మనుషుల్ని ఏమార్చడమే వృత్తిగా మార్చుకుంది. ఇటీవల జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తికి వలవేసి అతడి ఇంట్లో చేరింది. ఆ ఇంట్లోని బంగారమంతా మూటగట్టుకుని ఉడాయించబోతుండగా..  స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో పాత కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంకు చెందిన సుంకరి భాగ్యలక్ష్మి అనే మహిళ 20 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా వంగపల్లిపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉండేది. అదే గ్రామానికి చెందిన మండల సూర్యారావు, పెంటమ్మ దంపతుల నాలుగేళ్ల కుమారుడు శంకరరావును 1998 మార్చి 8న కిడ్నాప్‌ చేసింది.

ఆ ఇంట్లోంచి రూ.15 వేల నగదు, ఆరున్నర తులాల బంగారాన్ని కూడా అపహరించుకుపోయింది. అప్పట్లో బాలుడి తల్లిదండ్రులు చీపురుపల్లి పోలీసులను ఆశ్రయించగా.. ఏళ్ల తరబడి విచారణ జరిపినా ఆ మహిళతోపాటు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కేసును మూసేశారు. 20 ఏళ్ల తరువాత అనూహ్యంగా జియ్యమ్మవలసలో పట్టుబడిన ఆమెను హెడ్‌ కానిస్టేబుల్‌ లోపింటి రామకృష్ణ గుర్తించడంతో కిడ్నాప్‌ కేసు వెలుగులోకి వచ్చింది. విశేషం ఏమంటే.. బాలుడు కిడ్నాపైన సందర్భంలో రామకృష్ణ చీపురుపల్లి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తుండేవారు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన బృందంలో అతడు పనిచేశారు.

స్పష్టత లేని సమాధానాలిస్తున్న నిందితురాలు 
బాలుడిని కిడ్నాప్‌ చేసింది తానేనని, 16 సంవత్సరాల వరకు మాత్రమే తనతో ఉన్నాడని నిందితురాలు భాగ్యలక్ష్మి చెబుతోంది. ఎక్కడున్నాడో తెలియదని ఒకసారి, హైదరాబాద్‌లో తన బావ దగ్గర ఉన్నాడని మరోసారి చెబుతోంది. ఇదిలావుంటే.. 20 ఏళ్లుగా తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని.. ఇప్పుడైనా తమ బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని తల్లి పెంటమ్మ వేడుకుంటోంది. కేసును తిరిగి తెరిచేందుకు కోర్టును ఆశ్రయించామని, త్వరలోనే బాలుడి ఆచూకీ కనిపెడతామని చీపురుపల్లి సీఐ సీహెచ్‌.రాజులునాయుడు చెప్పారు.

మరిన్ని వార్తలు