జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

25 Jul, 2019 07:45 IST|Sakshi

60 గంటల ఉత్కంఠకు తెర

సాక్షి, మండపేట: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. మండపేటలో గత సోమవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన జసిత్‌ ఆచూకీ కోసం 500 మంది పోలీసులు 17 ప్రత్యేక బృందాలుగా రెండు రోజుల నుంచి జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలతో బెదిరిపోయిన దుండగులు ఎట్టకేలకు జసిత్‌ను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్‌ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. జసిత్‌ను ఎవరు కిడ్నాప్‌ చేశారో.. ఎందుకు కిడ్నాప్‌ చేశారో ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం.

ఒంటిగంట ప్రాంతంలో లభ్యం..
చింతాలమ్మ గుడివద్ద ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే ఏసు అనే వ్యక్తి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన క్రమంలో రోడ్డుపక్కన ఓ పిల్లాడు కనిపించాడు. జసిత్‌ అతన్ని అతన్ని చూసి పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. జసిత్‌ కిడ్నాప్‌ తదితర వివరాలు తెలియకపోవడంతో ఏసు ఏం చేయలేకపోయాడు. తెల్లవారు జామున బట్టీ దగ్గరికి వచ్చిన యజమానికి బాలుడు దొరికిన విషయాన్ని చెప్పాడు. అప్పటికే సోషల్‌ మీడియాలో జసిత్‌ కిడ్నాప్‌ వార్తలు చూసిన సదరు వ్యక్తి.. బాలుడి తండ్రి వెంకటరమణకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంకటరమణ పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికివెళ్లి చిన్నారిని ఇంటికి తీసుకొచ్చారు. ఎస్పీ నయీంఅస్మీ జసిత్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు.

(చదవండి : జసిత్‌ కోసం ముమ్మర గాలింపు)

(చదవండి : మండపేటలో కిడ్నాప్‌ కలకలం)

మరిన్ని వార్తలు