వెలిగొండకు వెన్నుపోటు

17 Mar, 2017 13:02 IST|Sakshi
► ప్రాజెక్టు పూర్తికి కావల్సింది రూ.2,800 కోట్లు
► తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్ల మొక్కుబడి నిధులు విదిల్చిన సర్కారు మొదటి ఫేజ్‌ కే రూ.వెయ్యి కోట్లు అవసరం
► ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్ద కాలం పట్టే పరిస్థితి
► 2018కే నీళ్లంటూ బాబు మాటల గారడీ వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం ప్రగతి
► నిధులివ్వకపోయినా పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ప్రకాశం జిల్లాలో వరుస కరువులకు.. మితిమీరిన ఫ్లోరైడ్‌తో కిడ్నీ వ్యాధి మరణాలకు.. వెలిగొండ ప్రాజెక్టుతో పెద్ద లింకే ఉంది. ఇక్కడి కరువు నుంచి జనం గట్టెక్కాలన్నా... కిడ్నీ వ్యాధి మరణాలు తగ్గాలన్నా... పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా... వెలిగొండ ప్రాజెక్టే ఏకైక దిక్కు. వ్యవసాయరంగానికి కావాలి్సన సాగునీరు, జనం దప్పిక తీర్చే తాగునీరు ఈ ప్రాజెక్టు వల్లే సాధ్యం.
 
మోడువారిన పశ్చిమ ప్రకాశం కళకళలాడాలన్నా వెలిగొండతోనే సాధ్యం. మొత్తంగా ప్రకాశం జిల్లా మనుగడ వెలిగొండపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పాలకులు చేస్తున్న హామీలు ఆచరణలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగిలి ఉన్న పనులను నిధులిచ్చి పూర్తి చేసిన పాపానపోలేదు. దీంతో వెలిగొండ నీరు జిల్లా వాసులకు అందనంత దూరంలోనే ఉండిపోతోంది. 
 
ప్రకటనల ప్రగల్బాలే..
వెలిగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వెచ్చించి తన హయాంలోని నీటిని పారిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అవిగో నీళ్లు.. ఇదిగో ప్రాజెక్టు అంటూ మాటలతో సరిపెట్టడం తప్ప నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదు. తాజాగా వెలిగొండను పూర్తి చేసి 2018 జూ¯ŒS నాటికి నీటిని విడుదల చేస్తామంటూ మరోమారు బాబు గొప్పలు చెప్పారు.
 
వెలిగొండ మన హయాంలో పూర్తి చేస్తామని ఈ విషయాన్ని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసుకోండంటూ విజయవాడలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది జరిగి పట్టుమని 10 రోజులు కాకుండానే తాజా బడ్జెట్‌లో వెలిగొండకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి మరోమారు ఈ ప్రాజెక్టుపై బాబు వివక్ష చూపారు. ప్రాజెక్టు పూర్తి కావటానికి తాజా అంచనాల ప్రకారం మరో రూ.2,800 కోట్లు అవసరం. 
 
చంద్రబాబు చెప్పినట్లు ఫేజ్‌–1 పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయటానికి కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. కానీ బడ్జెట్‌లో బాబు సర్కారు కేటాయించింది మాత్రం రూ.200 కోట్లే. ఈ లెక్కన మరో 15 ఏళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తి కాదని బాబు చెప్పకనే చెప్పారు. వెలిగొండకు సర్కారు నిధులు కేటాయించకపోయినా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. 
 
జిల్లా అభివృద్ధికి వెలిగొండే ఆధారం
జిల్లాలోని వ్యవసాయ రంగమే కాదు.. పారిశ్రామిక రంగం సైతం వెలిగొండ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్‌ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది.
 
వెలిగొండ నీరు లేకపోతే ఏ ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనట్లే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కుబడి నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఇచ్చినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నా కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిర్మాణ పనులకు రూ.25 కోట్లకుపైనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సైతం ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టన్నెల్‌–1, 2 పనులను ఇరువైపుల చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. తీరా బడ్జెట్‌లో చూస్తే సర్కారు రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వెలిగొండ పనులను వేగవంతం చేసే పరిస్థితి కనిపించటం లేదు. 
 
ఫ్లోరైడ్‌ పీడకు వెలిగొండే విరుగుడు..
జిల్లాలో ఫ్లోరైడ్‌ శాతం తీవ్ర స్థాయికి చేరింది. 15 శాతం ఫ్లోరైడ్‌ ఉన్న గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2,200 హాబిటేషన్లు ఉండగా 1200 హాబిటేషన్లలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉంది. దీంతో ఫ్లోరోసిస్‌ వ్యాధి తీవ్ర స్థాయికి చేరింది. తద్వారా కిడ్నీ వ్యా«ధితో జనం మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలోనే 427 మంది మరణించారు. వందలాది మంది మరణానికి దగ్గరగా ఉన్నారు. వేలాది మంది వ్యాధికి గురయ్యారు. రక్షిత మంచినీరు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వెలిగొండ పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్‌ తగ్గుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
 
జిల్లాలో ఫ్లోరైడ్‌ తీవ్రత, కిడ్నీ వ్యాధి మరణాలు వివరాలను ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఫ్లోరైడ్‌ బారి నుంచి జిల్లా వాసులను రక్షించాలని ఆయన కోరుతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నడ్డాకు వివరించారు. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరీ ఆశలు వెలిగొండపైనే ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే ఇప్పటికే ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి, వెలిగొండ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి్సన అవసరం ఉంది. 2018 నాటికైనా ప్రాజెక్టును పూర్తి చేయించి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేసి, కరువు జిల్లాను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి.  
 
మరిన్ని వార్తలు