-

సాయం చేయండి..ఊపిరి పోసుకుంటా

23 Apr, 2018 09:22 IST|Sakshi
కిడ్నీ బాధితుని వేడుకోలు

అసలే పేదరికం.....వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య తీవ్రమైంది.ఆర్థిక సమస్యలతో డయాలసిస్‌ చేయించుకోలేకఇబ్బంది పడుతున్నాడు. దాతలు సాయం చేస్తే ఊపిరి పోసుకుంటానని వేడుకుంటున్నాడు.   

సున్నపురాళ్లపల్లి (రాజంపేట టౌన్‌) : రాజంపేట మండలం సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన జి.వెంకటేష్‌ అలియాస్‌ ఉమర్‌బాషా రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వయస్సు పైబడటం, దానికి తోడు ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమర్‌బాషా కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.

ఈ నేపథ్యంలో ఉమర్‌బాషాకు కిడ్నీ సమస్య అధికమైంది. రెండు నెలలుగా మూడు రోజులకోసారి డయాలసిస్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల సహకారంతో కడపలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఒకసారి డయాలసిస్‌ చేయించుకుంటే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బాధితుడు చెబుతున్నాడు. సకాలంలో డబ్బులు లభించకుంటే వారం రోజుల వరకు డయాలసిస్‌ చేయించుకోకుండా ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహాయం చేస్తే తన ప్రాణం నిలబడుతుందని వేడుకుంటున్నాడు. మానవతావాదులు  8790085866  నంబరును సంప్రదించాలని కోరుతున్నాడు.   

మరిన్ని వార్తలు