చల్లపేటలో చావుడప్పు

19 Jul, 2017 07:39 IST|Sakshi
చల్లపేటలో చావుడప్పు

కిడ్నీ వ్యాధి... ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది జిల్లాలో ఉద్దాన ప్రాంతం. అటువంటి ఈ మాయదారి రోగం మైదాన ప్రాంతాల్లో కూడా విజృంభిస్తుంది. గార మండలంలోని అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో ఈ మహమ్మారి జడలు విప్పింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యాధిన బారిన పడి గ్రామంలో పలు కుటుంబాలు సతమతమవుతున్నాయి. గత ఏడాది వరకు 9 మందికి వ్యాధి సోకగా... ఈ ఏడాది ఆ సంఖ్య 20కి చేరింది. దీంతో మా గ్రామానికి ఏమైంది. అసలు కారణం ఏమై ఉంటుందని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

∙విజృంభిస్తున్న కిడ్నీ వ్యాధి
∙మూడేళ్లలో వివిధ కారణాలతో 34 మంది మృత్యువాత
∙భయాందోళనలో గ్రామస్తులు
∙పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు


గార: మండలంలో అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో కిడ్నీ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మాయదారి రోగం బారిన పడి పలువురు మృత్యువాత చెందారు. గ్రామంలో 282 కుటుంబాలు ఉండగా 1180 మంది జనాభా నివసిస్తున్నారు. ఇప్పటివరకు 20 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. కిడ్నీ వ్యాధి సోకిన రోగులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా గత మూడేళ్లగా 34 మంది మృత్యువాత చెందారు. వీరందరూ మధ్యవయస్కులే. వీరందరూ కిడ్నీ వ్యాధితో మృతి చెందారా లేదా అన్నది తెలియడం లేదు. అయితే గుండెపోటు, జ్వరం వంటి లక్షణాలతో అధికమంది ప్రాణాలు కోల్పోయారు.

నిత్యం కష్టపడి పనిచేసేవారికి గుండెపోటు అంటే కొంత అయోమయానికి గురిచేస్తుంది. వైద్య శాస్త్రం ప్రకారం కిడ్నీ వ్యాధి వస్తే త్వరగా మరణించే పరిస్థితిలేదు. కిడ్నీ వ్యాధికి అనుబంధంగా మరిన్ని రోగాలు(వీటిలో గుండెపోటు, జ్వరాలు) వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధితో నేరుగా చనిపోకపోయినా వీరందరి చావుకి కిడ్నీ వ్యాధితో సంబంధం ఉందని చెప్పవచ్చు.

తాగునీటి వనరులిలా...
గ్రామంలోని ప్రజలు రక్షిత పథకం, నేలబావి, బోరు నీటిని తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఈ నీటిని పలుమార్లు ప్రయోగశాలకు పంపించి పరీక్షలు చేసినా ఉద్దానం మాదిరి భూమిలో సిలికాన్‌ లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
 
నొప్పి మాత్రలే కారణమా...
గ్రామస్తులు ప్రతి చిన్నరోగానికి సంచివైద్యులను ఆశ్రయించడం పరిపాటి. దీనికి తోడు కీళ్లనొప్పులు అధికంగానే ఉన్నాయి. నొప్పి అంటేనే పెయిన్‌కిల్లర్‌ ట్యాబ్‌లెట్స్‌ రాసేయడం లేదా సూదిమందు వేసేయడం సంచి వైద్యుల అలవాటు. ఈ గ్రామస్తులు అతిగా పెయిన్‌కిల్లర్స్‌ వాడుతున్నారని వైద్య సిబ్బంది గతంలో చేసిన సర్వేలో తేల్చింది. దీనిపై అప్పటి కలెక్టర్‌ లక్ష్మీనరసింహం పెయిన్‌ కిల్లర్స్‌ తగ్గించేలా ప్రజల్లో చైతన్యం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

మరిన్ని వార్తలు