ప్రాణభిక్ష పెట్టండి

7 May, 2019 13:17 IST|Sakshi
మంచానికే పరిమితమయిన నాగేంద్ర, (ఇన్‌ సెట్‌లో) తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చిన మాతృమూర్తి నాగమ్మ

రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన బాధితుడు మైనంపాటి నాగేంద్ర

కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైన మాతృమూర్తి

ఆర్థికస్థోమత లేక ఆపరేషన్‌ చేయించుకోలేని వైనం

దాతలు స్పందించాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు

ఆ కుటుంబానికి అతడే ఆధారం.. కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించేవాడు.. ఏ చిన్న కష్టం వచ్చినా అన్నీ తానై కుటుంబానికి అండగా నిలిచేవాడు.. అలాంటి వ్యక్తిపై విధి పగబట్టింది. తొలుత అనారోగ్యం చేయడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ఆపరేషన్‌ అవసరమని డాక్టర్లు సూచించడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆపరేషన్‌ చేయించుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రికి చేరాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక మంచానికే పరిమితమయ్యాడు. కిడ్నీ దానం చేసేందుకు అతని మాతృమూర్తి ముందుకువచ్చినా ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని బాధితుడు మైనంపాటి నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహకరించి తనకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు.

నెల్లూరు, అల్లూరు: అల్లూరు మండలం ఇందుపూరు గ్రామానికి చెందిన మైనంపాటి వెంకటేశ్వర్లు(లేట్‌), నాగమ్మల కుమారుడు నాగేంద్ర. వయస్సు 31 సంవత్సరాలు. అల్లూరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నాగేంద్ర నృత్య కళాకారుడు కూడా. వీరిది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించుకునేందుకు చెన్నైలో దినసరి కూలీగా పనిచేసేవాడు. నాగేంద్రకు భార్య కస్తూరి, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అంతాబాగుందనుకుంటున్న సమయంలో విధి పగబట్టింది. నాగేంద్రకు తరచూ కడుపునొప్పి వస్తుండడంతో హాస్పిటల్‌ చూపించుకుంటే కడుపులో 3 కిలోల కణిత ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్‌ చేసి తీసివేయాలని చెప్పగా ఎలాగోలా తన వద్ద ఉన్న డబ్బుతో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. డాక్టర్లు కణితి తొలగించారు. కానీ సమస్య అంతటితో అయిపోలేదు. నాగేంద్ర కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యాడు. రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి దీనస్థితిని అనుభవిస్తున్నాడు.

ఇప్పటివరకు వైద్య చేయించుకునేందుకు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకోసం నెలకు రూ.10 వేల వరకు మందులతో సహా ఖర్చవుతోంది. అసలే నిరుపేద కుటుంబం అంత పెద్ద మొత్తం ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేక నానాఅవస్థలు పడుతున్నారు. కిడ్నీ దాతలు ముందుకు వచ్చి కిడ్నీ దానం చేస్తే తప్ప నాగేంద్ర బతకడని వైద్యులు తెలిపారు. ఆçపరేషన్‌ చేస్తే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో నాగేంద్ర తల్లి నాగమ్మ తన కుమారుడు పడుతున్న అవస్థను చూసి తట్టుకోలేక తన ఒక కిడ్నీని కుమారుడికి ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ కిడ్నీ మార్పిడి చేయించుకునే ఆర్థిక స్థోమత వీరికి లేదు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు దాదాపుగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక నాగేంద్ర కుటుంబసభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన బిడ్డను బతికించాలని నాగేంద్ర తల్లి, తన భర్తను బతికించాలని కస్తూరి ప్రార్థిస్తున్నారు. నాగేంద్ర మాత్రం తన కుటుంబానికి తానే ఆధారమని, తనను బతికించాలని పరిచయమున్న ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నాడు.

సాయం చేయదలచుకున్న దాతలు పూర్తి వివరాలకు సంప్రదించండి
పేరు – మైనంపాటి నాగేంద్ర
సెల్‌ – 75501 74783
బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌: 34015307025 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : ఎస్‌బీఐఎన్‌0015069
బ్రాంచ్‌ పేరు: ఎస్‌బీఐ – అల్లూరు శాఖ
ఫోన్‌ పే: 70970 83008

>
మరిన్ని వార్తలు