కిడ్నీ రాకెట్ కలకలం

18 Jun, 2014 01:15 IST|Sakshi
కిడ్నీ రాకెట్ కలకలం

సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి
నకిలీ పత్రాలతో అక్రమాలు
యథేచ్ఛగా అవయవమార్పిడి
 

కిడ్నీ రాకెట్ వ్యవహారం నగరంలో సంచలనమైంది.ఒడిశా-విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ వ్యవహారం సెవెన్‌హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. కార్పొరేట్ ఆస్పత్రుల మాయాజాలంపై
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
విశాఖపట్నం, మెడికల్ : ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌లో సాగుతున్న కిడ్నీ కుంభకోణ ఛాయలు విశాఖ నగరాన్ని తాకాయా?.. నగర పరిధిలోని కిడ్నీ మార్పిడులు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్చగా జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి నిదర్శనంగా మంగళవారం విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఉదంతం నిలుస్తోంది. దీంతో విశాఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలంటే ప్రజల్లో భయం పట్టుకుంటోంది. విశాఖ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉత్తరాంధ్ర  సరిహద్దు రాష్ట్రాలకు వైద్యపరంగా పెద్దదిక్కు. ఎటువంటి వైద్యానికైనా విశాఖపైనే ఆధారపడుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బు యావకు లోనై రోగుల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయన్న అనుమానాలను సెవెల్‌హిల్స్ నిజం చేసింది. కిడ్నీ మార్పిడి సంఘటనలో ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఇప్పుడు కలకలం రేపింది.

 అవయవ మార్పిడికి సంబంధించి రక్త సంబంధీకులు, ఇతర బంధు వర్గాల నుంచి అవయవాలను దానంగా పొందాలంటే ఏపీ అవయవమార్పిడి చట్టం నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండే బోధనాస్పత్రి పరిధిలోని ఆథరైజేషన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనుమతుల్లో అస్పష్టత ఉండడంతో దీనిని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు దండుకుంటున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

 నగరంలో చాలా కార్పొరేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ దొడ్డిదారిన యథేచ్ఛగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా నగరంలోని కేర్, అపోలో ఆస్పత్రుల్లో గుండె, కాలేయం, కిడ్నీ, కళ్లు తదితర అవయవాలను మార్పిడి చేసేందుకు అనుమతులున్నాయి. కీలక అవయవాల మర్పిడికి సంబంధించి ఏపీ జీవన్‌దాన్ అనుమతులను అవయవదాతలు, స్వీకరణకర్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లు, కిడ్నీ వంటి అవయవదానాలకు స్థానికంగా ఉండే ఆథరైజేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ ఎవరూ పాటించడం లేదు. ఈ అనుమతుల కోసం ఆథరైజేషన్ కమిటీ కూడా భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తుండడంతో, కమిటీకి తెలియకుండా అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం విశేషం.
 
 

మరిన్ని వార్తలు