ఉద్యోగానికి వెళ్తున్నారా.. కిడ్నీ జర భద్రం

16 Apr, 2014 14:50 IST|Sakshi
ఉద్యోగానికి వెళ్తున్నారా.. కిడ్నీ జర భద్రం

మీరు పదో తరగతి ఫెయిలైనా, పాసైనా పర్వాలేదు.. నెలకు పది, పదిహేను వేల రూపాయల జీతంతో ఉద్యోగం ఇస్తాం, ముందుగా వైద్యపరీక్షలు చేయిస్తాం అని ఎవరైనా చెబుతున్నారా? పొరపాటున కూడా నమ్మి వెళ్లకండి. అలా వెళ్లారో, మీ ఒంట్లోంచి మీకు తెలియకుండానే ఒక కిడ్నీ మాయమైపోయే ప్రమాదం పొంచి ఉంది. ఉద్యోగాల పేరుతో యువతకు ఎర వేస్తూ కిడ్నీలు దొంగిలిస్తున్న ఓ రాకెట్ వ్యవహారం మొత్తం హైదరాబాద్లో బయటపడింది.

ఇంతకుముందు కూడా విజయవాడ లాంటి నగరాలు కేంద్రాలుగా కిడ్నీ రాకెట్లు నడిచాయి. ఇప్పుడు మరోసారి అవి రెక్కలు విప్పుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లిన ఓ యువకుడి నుంచి అతడి కిడ్నీ దొంగిలించి.. ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టడంతో మొత్తం విషయం బయటపడింది.

శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా 'కిడ్నీ రాకెట్‌' నడుస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువకుడి అనుమానాస్పద మృతితో అసలు కథ వెలుగులోకి వచ్చింది. డిగ్రీ చదివిన దినేష్‌ కుమార్‌ అనే ఆ యువకుడు సూపర్‌ మార్కెట్‌ పనిమీద విశాఖ వెళ్తున్నానని గత నెల 22న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత..మీ సోదరుడు గుండెపోటుతో మృతి చెందాడు అంటూ గత నెల మార్చి 30న దినేష్‌ అన్న గణేష్‌కు కొలంబో పోలీసులనుంచి ఫోన్‌ వచ్చింది.

వెంటనే వారు భారత హైకమీషన్‌ అధికారుల సాయంతో దినేష్‌ మృతదేహాన్ని తెప్పించుకుని అంత్యక్రియలు జరిపించారు. అయితే విశాఖ వెళ్లిన వాడు కొలంబోకు ఎందుకు వెళ్లాడు అని కుటుంబ సభ్యులకు వచ్చిన అనుమానంతో వ్యవహారం మలుపు తిరిగింది. దినేష్‌కు చెందిన ఈమెయిల్స్‌ను పరిశీలించగా, మూత్రపిండాలు కొనుగోలు చేసే ఏజెంట్లతో అతను లెక్కలేనన్ని సార్లు సంప్రదింపులు జరిపినట్లు తేలింది. దీంతో కొలంబోకు వెళ్లిన తర్వాత మూత్రపిండాలు తీసుకుని దినేష్‌ను చంపేసి వుంటారని అతని సోదరుడు గణేష్‌..సిసిఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా