వేధింపుల వల్లే హత్య

15 May, 2015 01:37 IST|Sakshi
వేధింపుల వల్లే హత్య

అనిల్ హంతకుల పట్టివేత
 9 మంది నిందితుల అరెస్ట్
 పరారీలో మరో ముగ్గురు

 
విశాఖపట్నం: నగరంలో సంచలనం కలిగించిన రౌడీషీటర్ అనిల్ హత్య కేసు మిస్టరీ వీడింది. తొమ్మిది మంది హంతకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి నుంచి 7 కత్తులు, ఒక రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర శాంతిభద్రతల డీసీపీ సి.హెచ్.త్రివిక్రమవర్మ అందించిన వివరాలివి.

మట్టుబెట్టేందుకు ఏడాదిగా నిరీక్షణ

2011లో కైలాసపురంలో జరిగిన జంట హత్యల కేసులో ప్రత్యక్ష సాక్షి కుమార్, మరికొందరిని మృతుడు అనిల్ కుమార్ తీవ్రంగా వేధించేవాడు. దీంతో వారు అనిల్‌కుమార్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. జంట హత్యల కేసులో హతుడు రాజేష్ సోదరుడు మేరుగు చిట్టిబాబు కూడా అనిల్‌ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ 31 టిటి 5653 నంబరు ఆటోను సమకూర్చుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కత్తులు, రాడ్ల ఆటోలో దాచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా 8వ తేదీ సాయంత్రమే బీచ్‌రోడ్డు కురుసుర మ్యూజియం వద్ద కలుసుకున్నారు.

అదే సమయంలో ఫిషింగ్ హార్బర్ జెట్టి వద్ద టెంకు రమణతో అనిల్ గొడవ పడ్డాడు. వెంటనే రమణ ఈ విషయాన్ని పొడుగు కిరణ్‌కు విషయం తెలియజేయడంతో ప్రణాళిక అమలుకు సిద్ధమై జెట్టీకి చేరుకున్నారు. అప్పటికే అనిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 12 గంటల సమయంలో అల్లిపురం గాంధీ బొమ్మ సమీపంలో బావమరిది కరుణతో అనిల్ మాట్లాడుతుండగా అక్కడికి మేరుగు చిట్టిబాబు, అంబటి మధుసూదనరావు, కర్రి అప్పన్న, షణ్ముఖంలు చేరుకున్నారు. అనిల్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడి విచక్షణరహితంగా కత్తులతో నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రత్యక్ష సాక్షి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నక్కపల్లి వద్ద మేరుగు చిట్టిబాబు అలియాస్ మమ్ము, అంబటి మధుసూదనరావు, కర్రి అప్పన్న అలియాస్ నాని, టేకుమూడి లక్ష్మణ్, అల్లిపిల్లి సతీష్, తిరుపతి ఆర్యకుమార్, బొట్టా నరసింహామూర్తి అలియాస్ నచ్చు, పసుపులేటి విజయకుమార్ అలియాస్ మచ్చ, టెంకి అప్పలరాజు అలియాస్ బప్పిలను అదుపులోకి తీసుకున్నారు.

మరో ముగ్గురు నిందితులు షణ్ముఖం, పొడుగు కిరణ్, మధు పరారీలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు దర్యాప్తులో చురుగ్గా పాల్గొని నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తరపున డీసీపీ సి.హెచ్.త్రివిక్రమ వర్మ అభినందించారు. సమావేశంలో ఈస్ట్ ఏసీపీ ఆర్.రమణ, సీఐలు కొండ, టి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు