ఏబీ ‘స్మార్ట్ చాయిస్’ ప్రారంభం

2 Jan, 2014 04:57 IST|Sakshi

హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కొత్త సంవత్సర కానుకగా ఏబీ స్మార్ట్ చాయిస్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రా బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ధనుంజయ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారులు ఈ పథకం కింద 179 రోజులకు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. డిపాజిట్ చేసిన డబ్బులు వారం రోజుల్లో కూడా తిరిగి ఇస్తామని, వడ్డీ మాత్రం 7.85 చెల్లిస్తామన్నారు.

బ్యాంకులో ఖాతాదారుడిగా ఉండి ఏబీ జీవన్ అభయప్లస్ పథకంలో చేరిన వారు సాధారణ మరణం పొందినప్పటికీ బీమా చెల్లిస్తామని తెలిపారు. పథకానికి 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు అర్హులని వివరించారు. వీరు ప్రతీ ఏడాది ప్రీమియం కింద రూ.346 చెల్లించాలని, అలాగే 36 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు రూ.766 కట్టాలని సూచించారు. ప్రీమియం చెల్లిస్తూ సాధారణ మరణం పొందితే బీమా కింద రూ.2లక్షలు అందిస్తామని చెప్పారు.

జోన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ ఏడాది రూ.5వేల కోట్ల వ్యాపారం చేశామని తెలిపారు. వరంగల్ పరిధిలో 34, ఖమ్మం పరిధిలో 35 శాఖలు ఉన్నట్లు చెప్పారు. మార్చినాటికి మరో రూ.వంద కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించినటు పేర్కొన్నారు. కాగా, హసన్‌పర్తిలో త్వరలోనే ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.  సమావేశంలో బీఎం శివచంద్రబాబు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు