అడ్డుగా ఉన్నాడని హతమార్చారు

27 Jul, 2015 23:44 IST|Sakshi
అడ్డుగా ఉన్నాడని హతమార్చారు

ప్రియునితో కలిసి భర్తను చంపిన వైనం
మర్రివలసలో దారుణం ప్లాస్టిక్ వైర్లతో ఉరి
సహజమరణంగా నమ్మించేందుకు యత్నం నిలదీసిన గ్రామస్తులు
నేరం అంగీకరించిన మృతుని భార్య
పరారీలో ప్రియుడు
 

కె.కోటపాడు : వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియునితో కలిసి ఉరివేసి హతమార్చిన సంఘటన మర్రివలస గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలావున్నాయి. మర్రివలస గ్రామానికి చెందిన సీముసురు కొండమ్మ (42), సీముసురు కోనారితో 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కొండమ్మ భర్త సీముసురు బంగారయ్య (52) ఇంటివద్ద భోజనం చేసి రోజూమాదిరిగానే గ్రామ శివారులోని పాకవద్దకు వెళ్లి పడుకున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న భార్య కొండమ్మ, కోనారి కలిసి మంచంపై పడుకున్న బంగారయ్యను ప్లాస్టిక్ వైర్లతో గొంతునులిమి హతమార్చారు. అనంతరం వారు అక్కడినుంచి జారుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో  కుమారుడు పైడిరాజు, కోడలు కృష్ణవేణి వద్దకు వెళ్లి తండ్రి బంగారయ్య పాకవద్ద చనిపోయి ఉన్నాడని కొండమ్మ చెప్పింది. దీంతో వారు పాకవద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంగారయ్య మెడచుట్టూ ఉరితీసిన ఆనవాళ్లు ఉండటంతో అనుమానించిన వారు పరిసరాలను పరిశీలించారు.

మంచంపక్కనే ప్లాస్టిక్ వైర్లు ఉండటంతో హత్యకు గురైనట్టు అనుమానించిన గ్రామస్తులు కొండమ్మను నిలదీశారు. భర్త బంగారయ్యను తాను చంపుకున్నానని ఆమె బదులివ్వడంతో సర్పంచ్ ఎ. కోడూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చోడవరం సీఐ కిరణ్‌కుమార్, ఎ.కోడూరు ఎస్‌ఐ అల్లు స్వామినాయుడు కొండమ్మను విచారించారు. భర్తను ప్లాస్టిక్ వైరుతో మెడకు ఉరివేసి తాను, కోనారి కలసి హతమార్చామని ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. కొండమ్మను అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న కోనారికోసం  పోలీసులు గాలిస్తున్నారు.
 
 గతంలోనూ హత్యాయత్నం!

 వివాహేతర సంబంధంపై నిలదీస్తున్న భర్తను హతమార్చేందుకు గతంలోను ప్రయత్నించిందని గ్రామస్తులు తెలిపారు. అప్పటిలో స్థానికులు మందలించడంతో వి రమించిందని వారు పేర్కొన్నారు. కొండమ్మ, కోనారి వివాహేతర సంబంధంపై బంగారయ్య తరచూ నిలదీ యడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు.  నెలరోజులపాటు వేరే గ్రామం లో ఉన్న కొండమ్మ ఇటీవల గ్రామానికి వచ్చిందని, కూలిసొమ్ముకోసం భర్తతో ఘర్షణ పడిందని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో బంగారయ్యను అడ్డుతొలగించేందుకు కొండమ్మ, కోనారి పథకం ప్రకారం హత్యచేశారని పోలీసులు తెలిపారు. మృతుడు బంగారయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా