అడుగు దూరంలో కలల వంతెన

20 Jan, 2020 12:49 IST|Sakshi
రుషింగి వైపు నిలిచిపోయిన కిమ్మి వంతెన కోసం 11వ పిల్లర్‌ నిర్మించాల్సింది ఇక్కడే

చివరి దశలో నిలిచిపోయిన కిమ్మి–రుషింగి బ్రిడ్జి పనులు

ఒకే ఒక్క పిల్లర్‌ పనులకుఏర్పడినఅడ్డంకులు

సాంకేతిక అనుమతులు ఇచ్చినా ముందుకు సాగని నిర్మాణం

శ్రీకాకుళం, వీరఘట్టం: కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. పనులన్నీ ఆఖరి దశకు చేరుకున్నాయి. అయితే చివర్లో నిర్మించాల్సిన ఒక్క పిల్లర్‌ పనులు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడే ఆగిపోయింది. కొత్త సర్కారు వచ్చాక డిజైన్‌ మార్పుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో లైన్‌క్లియర్‌ అయింది. నిర్మాణాలకు అనువుగా ఉండే వేసవి కాలంలో పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు పట్టుదలగా ఉన్నారు. నాగావళి నదిలో కిమ్మి–రుషింగి గ్రామాల మధ్య 2008లో జరిగిన పడవ ప్రమాదంలో ఎనిమిదిమంది మృతి చెందడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేసింది. రూ.29 కోట్ల నాబార్డు నిధులతో 2012లో పనులు ప్రారంభమయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోవడంతో వంతెన పనుల్లో వేగం తగ్గింది. గతేడాది మార్చికి పూర్తి కావాల్సిన ఈ పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనుల తీరు ఉంది. 

నిలిచిపోయిన 11వ పిల్లర్‌ పనులు
చివరి దశలో నిర్మించాల్సిన పిల్లర్‌ పనులను వాస్తవానికి 2013లో ప్రారంభించారు. అయితే ఈ పనులు సగంలో ఉండగా అదే ఏడాది నాగావళికి వచ్చిన భారీ వరదల్లో ఈ పిల్లరు భూమిలోకి కూరుకుపోయింది. దీంతో అధికారులు ఈ పిల్లరును సరిచేయకుండా మిగతా పిల్లర్ల పనులు వేగంగా పూర్తిచేశారు. తర్వాత భూమిలో కూరుకుపోయిన పిల్లర్‌ను బాంబులు పెట్టి విచ్ఛిన్నం చేశారు. అయితే బాంబులు పెట్టి పిల్లర్‌ను తొలగించినప్పటికీ దీని శకలాలు భూమి అడుగులో ఉండిపోయాయి. మొదట అనుకున్న డిజైన్‌ ప్రకారం ఇదే ప్రాంతంలో పిల్లర్‌ పనులు చేయాల్సి ఉంది. అయితే ఈ పనులకు భూమి కిఐద ఉన్న గత పిల్లర్‌ శకలాలు అడ్డుగా ఉండడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్‌ అధికారులు ఇక్కడ నిర్మించాల్సిన పిల్లర్‌ డిజైన్‌ మార్చి ప్రభుత్వానికి నివేదించారు. ఇంజనీరింగ్‌ అధికారులు పంపిన నివేదికను ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించి అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కాంట్రాక్టర్‌ పనులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది కూడా తమకు పడవ ప్రయాణమే గతి అని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి తమకు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వంతెన పనులు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌వీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అందువల్లనే తాము మిగతా పనులు చేపట్టలేకపోయామన్నారు.

కొద్ది రోజుల్లో పనులు చేపడతాం
చివరిలో నిలిచిపోయిన ఒకే ఒక్క పిల్లర్‌ పనులకు సాంకేతిక అనుమతులు కూడా కొత్త ప్రభుత్వం ఇచ్చింది. పిల్లర్‌ పనులు చేపట్టే చోట నీటి ప్రవాహం ఉండడంతో ఇన్ని రోజులూ పనులు చేపట్టలేకపోయాం. ప్రస్తుతం వాతావరణం పనులకు అనుకూలంగా ఉంది. మరి కొద్ది రోజులు పనులు పూర్తి చేస్తాం.–నాగభూషణరావు, ఏఈ, కిమ్మి–రుషింగి వంతెన పర్యవేక్షకుడు

మరిన్ని వార్తలు