దశావతారం

10 Oct, 2014 01:32 IST|Sakshi

ఇంతింతై వటుడింతై అన్నట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో విశాఖ అంచలంచెలుగా ఎదిగింది. 1988లో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ మొదలు గత ఏడాది భారత్-వెస్టిండీస్ మ్యాచ్ వరకు పదహారేళ్లలో మొత్తం పది వన్డే మ్యాచ్‌లు జరిగాయిక్కడ. అరకొర వసతులతో ఉన్న మున్సిపల్ స్టేడియంను ముస్తాబు చేసి అంతర్జాతీయ మ్యాచ్‌కు నడుం కట్టిన దగ్గర్నుంచి ప్రపంచ ప్రమాణాలతో అధునాతన స్టేడియంను సమకూర్చుకునే వరకు విశాఖ క్రికెట్ రంగానిది ఓ విశిష్ట చరిత్ర. డి.వి.సుబ్బారావు వంటి ఉద్దండుల కృషి ఫలితమిది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ హోదాకు తగిన హంగులు సమకూర్చుకొని అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మంగళవారం భారత్-వెస్టిండీస్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఈ అందాల నగరంలో జరిగిన పది వన్డే మ్యాచ్‌లపై విహంగ వీక్షణం...
తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆల్‌రౌండ్ ప్రతిభ
 
వైజాగ్‌లో తొలి మ్యాచ్ 1988 డిసెంబర్ 10న జరిగింది. భారత జట్టుకు దిలీప్ వెంగ్‌సర్కార్ నాయకత్వం వహించాడు. న్యూజిలాండ్ జట్టుకు జాన్ రైట్ నాయకత్వం వహించాడు. జోన్స్ 64 పరుగులు, రూథర్‌ఫోర్డ్ 67 పరుగులు చేశారు. దాంతో న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి వికెట్ కపిల్‌దేవ్‌కు లభించింది. అప్పట్లో బ్యాటింగ్ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన క్రిష్ శ్రీకాంత్ ఆఫ్‌స్పిన్‌తో విజృంభించి 7 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఐదువికెట్లు పడగొట్టాడు. విశాఖలో ఇదే బౌలింగ్‌లో అత్యుత్తమ రికార్డు. తర్వాత భారత బ్యాటింగ్‌లో శ్రీకాంత్ 70 పరుగులు, అజరుద్దీన్ 48 పరుగులు చేశారు. లక్ష్యాన్ని భారత జట్టు 46.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి సాధించింది.
 
అలరించిన సచిన్, సిద్దూ

రెండో వన్డే 1994 నవంబర్ 7న జరిగింది. భారత వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించింది. సచిన్ 54 పరుగులు చేశాడు. విశాఖ ప్రేక్షకులను సచిన్ అలరించాడు. జడేజాతో కలసి సచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన సిద్ధూ విజృంభించి 103 బాల్స్ ఎదుర్కొని 9 బౌండరీలు,రెండు సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కెప్టెన్ అజరుద్దీన్ 45 పరుగులు చేశాడు. వెస్టిండీస్ పోరాడినా, స్లో ఓవర్ రేట్ వల్ల ఓ ఓవర్ జరిమానాగా కోల్పోవడం ఆ జట్టు కొంప ముంచింది. ఆ జట్టు 43 ఓవర్లే బ్యాటింగ్ చేసి ఏడు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి మ్యాచ్‌ను కేవలం 4 పరుగుల తేడాలో కోల్పోయింది. అప్పట్లో బ్యాటింగ్ సెన్సేషన్ లారా 39 పరుగులు చేశాడు. సిమ్మన్స్ 51 పరుగులు, కార్ల్ హూపర్ 74 పరుగులు చేశారు. సిమ్మన్స్ వికెట్ సచిన్‌కు లభించింది.
 
చెలరేగిన ‘వా’ సోదరులు

వైజాగ్‌లో మూడో మ్యాచ్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ లీగ్ మ్యాచ్‌గా జరిగింది. ఫిబ్రవరి 23, 1996న జరిగిన ఈ మ్యాచ్‌లో కొదమ సింహం ఆస్ట్రేలియా, పసికూన కెన్యా తలపడ్డాయి. ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 304 పరుగులు భారీస్కోర్ సాధించింది. మార్క్ వా చెలరేగి 128 బాల్స్‌లో 14 బౌండరీలు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేశాడు. అతని సోదరుడు స్టీవ్ వా 82 పరుగులు చేశాడు. కెన్యా 7 వికెట్ల నష్టానికి 204 పరుగులే చేసి చిత్తుగా ఓడింది. ఒంటెనో 85 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ప్రముఖ పేసర్ మెక్‌గ్రాత్ తదితరుల విజృంభణను వైజాగ్ ప్రేక్షఖులు తొలిసారిగా చూడగలిగారు.
 
పాక్‌పై శ్రీలంక గెలుపు

విశాఖలో నాలుగో మ్యాచ్ పెప్సీకప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది. 1999 మార్చి 27న జరిగిన  ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జయవర్దనే 101 పరుగులు చేశాడు. పాక్ జట్టులో అజర్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్ వసీం అక్రమ్ చెలరేగి 60 బంతుల్లో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఆ జట్టు 46.3 ఓవర్లలో 241 పరుగులకే ఆలవుట్ అయింది. లంక జట్టు 12పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది.
 
కంగారెత్తించారు...

విశాఖపట్నంలో ఐదో మ్యాచ్ భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2001 ఏప్రిల్ 3న జరిగింది.  ఆస్ట్రేలియా జట్టు భారతబౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్ హేడెన్, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన పాంటింగ్ చెలరేగిపోయారు. హేడెన్ 111 పరుగులు, పాంటింగ్ 101 పరుగులు చేసి మొదటి వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత భారత బ్యాటింగ్‌లో సచిన్ ఉన్నది కొద్ది సేపైనా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిం చాడు. అతడు 68 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి 11 బౌండరీలతో 62 పరుగులు చేశాడు. విశాఖ లో సచిన్‌కు ఇది అత్యధిక స్కోర్. మిగిలిన భా రత బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు.  
 
ధోనీ స్టార్ అయ్యిందిక్కడే..

వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులైన భారత,పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. 2005 అక్టోబర్ 5న జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా భారత అభిమానులకు కనుల పండువగా జరిగింది. అప్పటి బ్యాటింగ్ సంచల నం, ఇప్పటి కెప్టెన్ తన హెలికాప్టర్ షాట్లతో అల రించింది ఇక్కడే. ధోనీ ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు సెవాగ్, ధోనీ అండతో ఆడుతూ పాడుతూ 9 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధిం చింది. ఓపెనర్ సెవాగ్ 12 ఫోర్లు,రెండు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ధనాధన్ ధోనీ 123 బంతుల్లో 15 బౌండరీలు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. పాక్ జట్టు బ్యాటింగ్‌లో రజాక్ (88), యూసఫ్ యొహానా (71) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత్ తిరుగులేని రీతిలో 58 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది.
 
‘యూవీ’రవిహారం

విశాఖలో ఏడో మ్యాచ్ భారత, శ్రీలంక జట్ల మధ్య 2007 ఫిబ్రవరి 17న జరిగింది. చమర సిల్వా సెంచరీ సాయంతో శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది. తర్వాత భారత బ్యాటింగ్‌లో యువరాజ్ సింగ్ వీరవిహారం చేశాడు. 83 బంతుల్లో 11 బౌండరీలు, 3 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు సాధించాడు. గంగూలీ అజేయంగా 58 పరుగులు, ఉతప్ప 52 పరుగులు సాధించడంతో భారత జట్టు 41 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు సాధించింది.
 
ఆస్ట్రేలియాపై కసి తీర్చుకున్న భారత్

ఆస్ట్రేలియా జట్టు విశాఖలో మరో మ్యాచ్ ఆడినా ఈసారి పరాజయం నుంచి తప్పించుకోలేక పోయింది. 2010 అక్టోబర్ 20న జరిగిన ఈమ్యాచ్‌లో భారత జట్టు కసిగా ఆడి ఐదు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో కెప్టెన్ క్లార్క్ 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హసీ (69), వైట్ (89) అతనికి తోడ్పాటు అందించారు. దాంతో కంగారూ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసిం ది. కోహ్లీ 118 పరుగులు చేసి భార త గెలుపుకు బాట వేశాడు. యువరాజ్ సింగ్ 58 పరుగులు చేయగా, కీలక దశలో సురేశ్‌రైనా కేవలం 47 బంతుల్లో 71 పరుగులు చేసి భారత్‌ను గెలుపు తీరం చేర్చాడు.
 
వెస్టిండీస్‌పై జయభేరి
 
విశాఖలో తొమ్మిదో మ్యాచ్ భారత, వెస్టిండీస్ జట్ల మధ్య 2011 డిసెంబర్ 2న జరిగింది. భారత్ అలవోకగా ఐదు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 269 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగి 117 పరుగులు చేసి భారత్‌కు గట్టి పునాది వేశాడు. రో‘హిట్’ శర్మ రాణించి అజేయంగా 90 పరుగులు చేయడంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి అవలీలగా గెలుపొందింది.

వైఎస్సార్ స్టేడియంలో తొలి ఓటమి

విశాఖలో గత ఏడాది మరోసారి ఆడిన వెస్టిండీస్ జట్టు అనుకోని రీతిలో భారత జట్టుకు షాక్ తినిపించింది. ఈ మ్యాచ్ నవంబర్ 24న జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 288 పరుగుల స్కోరు సాధించింది. కోహ్లీ కేవలం ఒక్క పరుగులో సెంచరీ మిస్ అయ్యాడు. ధోనీ అజేయంగా అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ అంతా బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరం చేర్చారు.
 
రెండు వేల మందితో బందోబస్తు
 
అల్లిపురం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర శాంతి, భద్రతల డీసీపీ ఎం.శ్రీనివాసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లకు సుమారు 2 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. నాలుగు వందల మంది అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. ఇప్పటికే హనుమంతవాక నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వరకు విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 17న కూడా నగరంలో మరో వన్డే మ్యాచ్ జరిగే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో అవసరాన్ని బట్టి బందోబస్తును పెంచుతామన్నారు. నగర ఇన్‌చార్జి సీపీ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా