విశాఖలో నాలుగు కృత్రిమ అవయవ కేంద్రాలు

8 Sep, 2014 01:03 IST|Sakshi
  •      సినీ హబ్‌గా విశాఖ
  •      19 నుంచి వికలాంగుల  పేర్లు నమోదు
  •      ఎంపీ హరిబాబు వెల్లడి
  • విశాఖపట్నం: విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు చోట్ల కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వంద రోజుల పాలన పై వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కొత్తవలస, భీమిలి, విశాఖపట్నం, గాజువాకల్లో కృత్రిమ అవయవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

    కృత్రిమ అవయవాలు అవసరమైన వికలాంగులు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బీజేపీలోకి చేరేందుకు ప్రజలందర్నీ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. పదవులకు ఆశించకుండా పార్టీలో చేరాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మన దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చే శారు. విశాఖ నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్ధుకుంటుందన్నారు.

    ఇక్కడ సినీ పరిశ్రమకు వాతావరణం అనుకూలంగా ఉన్నందున సినీ హబ్‌గా కూడా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మద్యం షాపులు, బార్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే వారి తరఫున పోరాటం చేస్తామన్నారు. నిర్ణీత సమయానికే బార్లు, మద్యం షాపులు మూసివేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోడీ వందరోజుల పాలనపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

    ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వి.చలపతిరావు, సిటీ ప్రెసిడెంట్ పి.వి.నారాయణరావు, నాయకులు బండారు రంగమోహన్, పి.వి.ఎన్.మాధవ్, మళ్ల వెంకటరావు, నరేంద్ర ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  బీజేపీలో చేరిన ప్రభాగౌడ్ ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ నేత ప్రభాగౌడ్ బీజేపీలో చేరారు.  
     

మరిన్ని వార్తలు