విశాఖలో మాస్టర్ స్ట్రోక్స్!

14 Nov, 2013 01:58 IST|Sakshi

=మాస్టర్ మధుర స్మృతులివి..
 =నగరంలో ఆడినది నాలుగైదు సార్లే..
 =ఒకే ఒక్క అర్ధ శతకం

 
విశాఖపట్నం, న్యూస్‌లైన్ :  అనితర సాధ్యమైన రికార్డులు అందుకుని.. అద్భుతాలను మళ్లీ మళ్లీ సృష్టించి.. రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్ ఆటనే బంతిగా మార్చి తన చుట్టూ తిప్పుకున్న క్రీడా దైవ స్వరూపుడు.. ఆటకు సంబంధించిన అవతారాన్ని ముగించే ఘట్టం ప్రారంభమవుతోంది. సచిన్ ఇక సెలవని చెప్పే ఘడియ ఆసన్నమవుతోంది. భారత క్రికెట్‌లో మేరు నగ ధీరుడిగా, అభిమానులకు ఆరాధ్యుడిగా, సంచలనాల సృష్టికర్తగా.. అంతకు మించి అత్యంత వినమ్ర స్వరూపుడిగా, అందరినీ అబ్బురపరిచిన నిరుపమాన ప్రతిభావంతుడిగా సచిన్ వ్యక్తిత్వం అందరి హృదయాల్లో ఓ మధుర స్మృతిగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో విశాఖ సైతం సచిన్ ఆత్మీయ స్మృతుల్లో తలమునకలవుతోంది.
 
నూనూగు మీసాల వయస్సులో..

విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్‌ల వరంపర మొదలైన తొలినాళ్ళలోనే విశాఖలో సచిన్ అడుగుపెట్టాడు. వస్తూనే కెప్టెన్సీని అందుకున్నాడు. అప్పటికి సచిన్‌కు 19 ఏళ్ళే. భారత్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ లెవెన్‌తో ఫిబ్రవరి 1993లో తలపడిన బోర్డ్ ప్రెసిడెంట్స్ లెవెన్ జట్టుకు నాయకత్వం అప్పట్లో సచిన్ సారథ్యం వహించాడు.  అతడు తొలిసారిగా నాయకత్వం వహించింది విశాఖలోనే కావడం విశేషం. చివరిసారిగా ఐపిఎల్ ఆడేందుకు విశాఖ వచ్చినా చేతిగాయంతో ఆడలేక పోవ డంతో విశాఖ క్రీడాభిమానులు నిరాశే మిగిలింది. అప్పట్లో సచిన్ నెట్స్‌లో మాత్రం చురుకుగా కదిలాడు.

రోహిత్ శర్మకు నెట్స్‌లో సలహాలిచ్చాడు. దాంతో డెక్కన్ చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రో‘హిట్’ చెలరేగి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. సచిన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రెండు వన్డేలలో, వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఓ వన్డేలోపాల్గొన్నాడు. 1994లో, 2001లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రెండు వన్డేలలో సచిన్ ఆడాడు. 2005లో వైఎస్సార్ స్టేడియంలో సచిన్ చివరిసారిగా విశాఖలో మ్యాచ్ ఆడాడు. విశాఖలో ఓ అర్ధ సెంచరీ మాత్రం సాధించాడు. చివరి మ్యాచ్‌లో రెండు పరుగులకే రనౌట్ అయ్యాడు. 2012 ఏప్రిల్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి సచిన్ చివరిసారిగా విశాఖ వచ్చాడు.
 

మరిన్ని వార్తలు