కిరణ్‌కు టాటా

20 Feb, 2014 01:58 IST|Sakshi
కిరణ్‌కు టాటా

 సాక్షి, గుంటూరు
 ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా అంశాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర విభజనకు నిరసనగా జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ఇక్కడి నేతలు మౌనం దాల్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిన్నటివరకు ముఖ్యమంత్రికి అనుకూలంగా మెలిగిన నేతలు తాజాగా ప్లేటు ఫిరాయించడం వెనుక కారణాలేమై ఉంటాయనే విషయంపై విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలెవరూ ‘కిరణ్’ బాటలో నడిచే  వాతావరణమే కనిపించడం లేదు. రాష్ట్రవిభజన విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నేతగా కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలో కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి ఆదినుంచి విభజన బిల్లుపై అధిష్టానానికి బద్ధులై పనిచే స్తున్నారు. వారు పార్టీని వీడే అవకాశమే లేదు.
 
 గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తొలుత ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ, ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ బహిష్కరణతో ఆయన టీడీపీకి మారనున్నట్లు వదంతులు వినిపించాయి. ఇక మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి బయటకు రావడం కష్టమేనని అంటున్నారు. మరోమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గతంలో ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నా.. విభజన బిల్లు ఆమోదం చివరి అంకంలో మాత్రం కిరణ్‌పై విరుచుకుపడటం సంచలనమైంది.
 
 సీఎంపై ‘కన్నా’ వర్గం విమర్శలు
 మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయుడిలా ఉంటున్నారు. రాష్ట్ర విభజనపై నోరుమెదపకపోవడాన్ని అధిష్టానం సైతం గుర్తించింది. పీసీసీ అధ్యక్షత, ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హుడంటూ ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో కిరణ్‌కు దూరంగా ఉన్నారు. సీఎం రాజీనామా ప్రకటించగానే జిల్లాలో కన్నా అనుచరవర్గం కిరణ్‌ను కాంగ్రెస్ నమ్మకద్రోహిగా విమర్శించింది. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీగా ఖమ్మం నుంచి పోటీచేసేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు సమాచారం. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి సీమాంధ్ర నేతలతో భేటీ అయినప్పుడు జిల్లానుంచి ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, షేక్ మస్తాన్‌వలి, కాండ్రు కమల, యర్రం వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. అయితే, వీరిలో గాదె వెంకటరెడ్డి, కాండ్రు కమల కాంగ్రెస్‌ను వీడతారా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది.
 
  షేక్ మస్తాన్‌వలీ ఏఐసీసీ ప్యానల్‌లో గులాంనబీ ఆజాద్‌కు సన్నిహితునిగా పేరుంది. యర్రం వెంకటేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కు అనుకూలమైనా.. ఆయన రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు సుముఖంగా లేరని సమాచారం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు వినుకొండ నియోజకవర్గం నుంచి  పోటీచేయనున్నట్లు బహిరంగంగా చెబుతున్నారు.  ముఖ్యమంత్రిగా కిరణ్ జిల్లాస్థాయిలో క్రియాశీల కార్యకర్తలతో నేరుగా మాట్లాడిన పరిస్థితులు లేకపోవడం.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు కొనసాగించకపోవడంతోనే తాజాగా ఆయన వెంట నడిచేవారు కరువయ్యారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వార్తలు