హస్తిన డెరైక్షన్లో అసెంబ్లీ రద్దు?

6 Jan, 2014 00:48 IST|Sakshi
హస్తిన డెరైక్షన్లో అసెంబ్లీ రద్దు?
  •  ఫిబ్రవరిలో రద్దు చేసే దిశగా సంకేతాలిస్తున్న కిరణ్
  •  ‘సమైక్య చాంపియన్’ముద్ర కోసమే?
  •  కొత్త పార్టీ ముసుగులో ఎన్నికలకు వెళ్లేలా పావులు
  •  హస్తిన డెరైక్షన్లోనే నాటకం
  •  ఓటాన్ అకౌంట్ బడ్జెట్
  •  సమావేశాలను త్వరగా ముగించాలంటూ ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్: బయటికి వీర సమైక్యవాదిగా పోజులిస్తూ, లోలోన మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారం విభజన ప్రక్రియకు మొదటినుంచీ పూర్తిగా సహకరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి... తన డబుల్ యాక్షన్‌ను త్వరలో తారస్థాయికి తీసుకెళ్లనున్నారా? రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ చర్చను సజావుగా ముగించి కేంద్రానికి తిప్పి పంపడం ద్వారా అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయనున్నారా? ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ‘కొత్త పార్టీ’ ముసుగులో, ‘సమైక్య కార్డు’తో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారా? అధిష్టానం స్థాయిలో ఈ మేరకు రూపుదిద్దుకున్న స్క్రిప్టును తు.చ అమల్లో పెడుతూ వస్తున్నారా? కొంతకాలంగా అధికారిక సవూవేశాల్లో కిరణ్ తీసుకుంటున్న పలు నిర్ణయూలు ఇవే సంకేతాలను ఇస్తున్నారుు. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహించడం పరిపాటి. కానీ ఈసారి ఏమాత్రం అవకాశమున్నా వాటిని జనవరి నెలాఖరు నుంచే మొదలు పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలని కిరణ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు! ఇది ‘అసెంబ్లీ రద్దు’ దిశగా గట్టి సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు.
 
  ఆత్రమంతా అందుకే...
  సాధారణ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం కోసం ఫిబ్రవరి 14 నుంచి 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కిరణ్‌కు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. 2014-15 రాష్ట్ర వార్షిక ప్రణాళికకు ఆదాయ వనరులు, ప్రణాళిక పరిమాణంపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కిరణ్ శనివారం సమావేశమై చర్చించారు. ఓటాన్ బడ్జెట్ సమావేశాలను వీలైనంత ముందుకు జరపాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర విభజన బిల్లుపై జనవరి 23 దాకా అసెంబ్లీలో చర్చ జరగనుండటం తెలిసిందే. అనంతరం నాలుగైదు రోజుల విరామంతో జనవరి నెలాఖరు నుంచి ఓటాన్ అకౌంట్ సమావేశాలను మొదలు పెట్టి, ఫిబ్రవరి తొలి వారానికల్లా ముగించాలని అధికారులకు కిరణ్ స్పష్టం చేశారు. అంత త్వరగా అంటే బడ్జెట్ పుస్తకాల ముద్రణ తదితరాల సాధ్యాసాధ్యాలపై వారు సందేహం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదని సమాచారం. కిరణ్ పట్టు నేపథ్యంలో జనవరి 28 నుంచే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగవచ్చని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన తీరు చూస్తుంటే అసెంబ్లీని ముందుగానే రద్దు చేసేలానే కన్పిస్తున్నారని అభిప్రాయపడుతున్నాయి.
 
 మొదటినుంచీ వి‘భజనే’
 కిరణ్  సొంత పార్టీ పెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన తాజా వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ అధిష్టానం, సొంత నేతలతోనే ‘వ్యతిరేక రాగం’ విన్పించి, కొత్త పార్టీ పెట్టించి, ఆ ముసుగులో ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని వ్యూహరచన చేసినట్టు పీసీసీ వర్గాల్లోనే చాలాకాలంగా విన్పిస్తుండటం తెలిసిందే. తాజా పరిణామాలు, సీఎం చర్యలన్నీ అందులో భాగంగానే కన్పిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సవూవేశాల్ని వీలైనంత త్వరగా మమ అన్పించి అసెంబ్లీని రద్దు చేసి, విభజన నిర్ణయానికి నిరసనగానే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటూ, సమైక్యవాద చాంపియన్‌గా పోజివ్వాలన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు. విభజనపై మొదటినుంచీ కిరణ్ మాటలకూ, చేతలకూ ఎక్కడా పొంతనే ఉండటం లేదన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో ప్రభుత్వోద్యోగులు కనీవినీ ఎరగని రీతిలో రెండు నెలలకు పైగా ఉద్యమిస్తే, వారి సమ్మెను కిరణ్ నయానా భయానా విరమింపజేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేద్దామని సీమాంధ్ర మంత్రులంతా ప్రతిపాదించినా, అలాగైతే అసెంబ్లీలో సమైక్యవాదాన్ని విన్పించేదెవరంటూ వారినీ వారించారు. విభజన ప్రక్రియ అంత సులువుగా ముందుకెళ్లదు లెమ్మంటూ ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను మభ్యపెడుతూ కాలం గడిపారు. కానీ విభజన దిశగా ఆయన జరగదని చెప్పిన ప్రతి ప్రక్రియా చకచకా పూర్తవుతూ వచ్చిన వైనం పీసీసీ వర్గాలనే విస్మయానికి గురి చేసింది. అవన్నీ కిరణ్‌కు తెలిసే జరిగాయని, ఈ విషయంలో కిరణ్ తమను పూర్తిగా మోసగించారని సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎంతగానో వాపోయారు కూడా. కనీసం విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి చేరకముందే సమైక్యాంధ్రకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా ఎవరు డిమాండ్ చేసినా కిరణ్ బేఖాతరు చేశారు. ఇక బిల్లు అసెంబ్లీకి చేరుకున్న రోజు ఆయన వ్యూహాత్మకంగా సభకు గైర్హాజరయ్యారు. పైగా సీమాంధ్రకు చెందిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభాపతి స్థానంలో ఉండకుండా, తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో బిల్లుపై చర్చ మొదలయ్యేలా పక్కా పథకం ప్రకారం పావులు కదిపిన వైనం రాష్ట్రమంతటినీ విస్మయానికి గురి చేసింది.
>
మరిన్ని వార్తలు