కిరణ్ కాన్వాయ్ వెనక్కి.. మాజీ సీఎంగా భద్రత

28 Feb, 2014 14:47 IST|Sakshi
కిరణ్ కాన్వాయ్ వెనక్కి.. మాజీ సీఎంగా భద్రత

హైదరాబాద్ : అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ను  ప్రోటోకాల్ అధికారులు శుక్రవారం వెనక్కి తీసుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనకు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కిరణ్ కాన్వాయ్ను అధికారులు వెనక్కి తీసుకున్నారు. అయితే మాజీ సీఎంగా ఆయనకు భద్రతను కొనసాగిస్తున్నారు.

దేశంలోనే అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగించిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంత విలువైన కాన్వాయ్ని వాడలేదు. ఆయన ఉపయోగించిన కాన్వాయ్ లో కొత్తగా ఇటీవలే చేర్చుకున్న రెండు వాహనాల విలువ సుమారు నాలుగు కోట్లపై మాటే. ఓ పక్క ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా....  దసరా కానుకగా కిరణ్ తనకు తానే రెండు ఎస్ యూవీలను కొనుగోలు చేసి గిప్ట్గా ఇచ్చుకున్నారు. కాన్వాయ్లోకి కొత్త కార్లు కావాలంటూ ఆదేశాలతో అధికారులు  3 ల్యాండ్‌ క్రూయిజర్ ప్రాడో కార్లను కొనుగోలు చేశారు. ఒక్కో కారు ధర కోటిన్నర కాగా, వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి మరో అరకోటి వెచ్చించారు. దీంతో రెండింటికి కలిపి నాలుగు కోట్లు ఖర్చయింది. ఇప్పుడు వాటన్నింటినీ వెనక్కి తీసుకున్నట్లే అయ్యింది.
 

మరిన్ని వార్తలు