ఆర్టీసీ కార్మిక సంఘాలతో సర్కారు చర్చలు సఫలం

5 Jul, 2013 04:29 IST|Sakshi
ఆర్టీసీ కార్మిక సంఘాలతో సర్కారు చర్చలు సఫలం
ఆర్టీసీకి ‘సమ్మె’ట పోటు తప్పింది. సంస్థ యాజమాన్యం, గుర్తింపు పొందిన  కార్మిక సంఘాలు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ మధ్య గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు ఫలించాయి. దశలవారీగా కాంట్రాక్టు కార్మికుల సర్వీసు క్రమబద్దీకరణకు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు వర్తించే విధంగా వేతన సవరణను అమలు చేయడానికి యాజమాన్యం అంగీకరించింది. వచ్చే సంవత్సరం నవంబర్ నాటికి కాంట్రాక్టు కార్మికులు అందరినీ క్రమబద్దీకరించడానికి చర్యలు చేపడతామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసి ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే వేతన సవరణ అమలు.. డిమాండ్లతో గుర్తింపు సంఘాలు ఈయూ, టీఎంయూ గత నెల్లో సమ్మె నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి బస్ భవన్‌లో ప్రారంభమైన చర్చలు పొద్దుపోయేవరకు కొనసాగాయి.
 
చర్చోపచర్చల అనంతరం... కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 17,287 మంది డ్రైవర్లు, కండక్టర్లు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 8,643 మందిని, నవంబర్‌లో 875 మందిని, వచ్చే ఏడాది మేలో 3,447 మందిని, సెప్టెంబర్‌లో 4,322 మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. రెగ్యులర్ కార్మికులకు అమలు చేసే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ను వర్తింపజేయడానికి కూడా యాజమాన్యం అంగీకరించింది. కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాాలను అమలు చేస్తామని తెలిపింది. యాజమాన్యం ప్రతిపాదనకు కార్మిక సంఘాలు అంగీకరించాయి. వేతన సవరణ అంశంపై మాత్రం ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఒక దశలో చర్చలు విఫలమయ్యే పరిస్థితి నెలకొంది. చివరకు అక్టోబర్ కల్లా వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేస్తామని, కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన విధంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి చర్యలు చేపడతామంటూ సంస్థ యాజమాన్యం హామీ ఇవ్వడంతో చర్చలు ఫలించాయి. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. వేతన సవరణ వల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు లక్షమందికి పైగా రెగ్యులర్ కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఒప్పందంపై సంతకాల అనంతరం కార్మిక నేతలు విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్, ఈడీలు, ఈయూ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, పద్మాకర్, జీడీ ప్రసాదరెడ్డి, రాజేంద్రప్రసాద్, టీఎంయూ నేతలు తిరుపతి, థామస్‌రెడ్డి, ఈఏ రెడ్డి, మారయ్య తదితరులు పాల్గొన్నారు.
 
సమ్మె యోచన  విరమణ
  దశలవారీగా 17 వేలమంది కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ
  అక్టోబర్‌కల్లా వేతన సవరణ ప్రక్రియ పూర్తి
  ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వేతన సవరణ వర్తింపు
  లక్షమందికి పైగా రెగ్యులర్ కార్మికులకు ప్రయోజనం
 
>
మరిన్ని వార్తలు