ఇక నల్లారి కొత్త పాత్ర

7 Mar, 2014 03:07 IST|Sakshi

 ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక పార్టీ అధ్యక్షునిగా కొత్త పాత్ర పోషించనున్నారు. ఆయన కొత్తపార్టీ పెడుతున్నట్టు ఎట్టకేలకు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన జిల్లాలో ఎలాంటి ప్రభావమూ చూపలేదు. కొత్త పార్టీ ఆయన ఉనికి కాపాడడానికి తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయం నుంచి కిరణ్ కొత్తపార్టీ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. రాజీనామా తరువాత తర్జనభర్జనల అనంతరం పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని గురువారం వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరుసటిరోజు కిరణ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈయన జిల్లాకు చెందిన వారు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రెండు వారాలు కావస్తున్నప్పటికీ జిల్లాలో కాలు పెట్టలేదు. అప్పటి నుంచి హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చే సమయంలోనూ కిరణ్ వెంట జిల్లా నుంచి అప్పటి డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ వంటి ఇద్దరు ముగ్గురు నాయకులు తప్ప ఎవరూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ప్రకటన చేయడం గమనార్హం.
 
  సమైక్య చాంపియన్ కావాలనుకుని జీరోగా మారిన ఆయన ఉనికి కోసం కొత్త రాజకీయపార్టీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయపార్టీని నడపడమంటే నల్లారికి నల్లేరు మీద నడక కాదనే విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ డ్రామాలో భాగమనే భావన ఉంది. కాగా జిల్లాలో ఆయన పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నప్పటికీ లాభనష్టాలపై పార్టీల్లో విశ్లేషణలు మొదలయ్యాయి.
 
 జిల్లాలో ఆయన వెంట నడిచేవారేరీ?
 ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే సమయానికి జిల్లాలో తనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నయానోభయానో వెంట రప్పించుకోగలిగిన కిరణ్‌కుమార్‌రెడ్డి, పదవికి రాజీనామా చేసే సమయానికి వారిలో పూర్తిస్థాయి విశ్వాసాన్ని నింపలేకపోయారు. ఈ విషయం ఇప్పటికే స్పష్టమైంది. ప్రస్తుతం ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ఆయన వెంట లేరు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేదికపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా? కిరణ్ పార్టీలో చేరుతారా? అనే సందేహాలు ఉన్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులపైనే కొత్త పార్టీ ఆధారపడాల్సి ఉంది. ఎన్నికల సమయం కావడంతో జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడం అంత సులువు కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 పీలేరు నుంచి సోదరుడు కిషోర్‌కు అవకాశం?
 కొత్త పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించబోతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నుంచి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డిని బరిలోకి తెస్తారని అంటున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున సీమాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుందనే సాకు తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓడినా గెలిచినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంతకన్నా మార్గం లేదని కొందరు సన్నిహితులు సూచించినట్టు సమాచారం. కాగా సొంత జిల్లాలో అభ్యర్థులను నిలపలేకపోయారనే నింద రాకుండా ఉండేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
 
 కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సుముఖంగా లేని ఆయనకు వైఎస్సార్‌సీపీ, టీడీపీల్లో అవకాశాలు లేవు. దీంతో కిరణ్‌పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మదనపల్లె నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ ఒకరు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. తిరుపతి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ, పీసీసీ మాజీ సంయుక్త కార్యదర్శి పి. నవీన్‌కుమార్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. చంద్రగిరికి బలమైన అభ్యర్థి దొరక కపోతే నవీన్‌కుమార్‌రెడ్డిని నిలిపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
 
 నగరి నుంచి కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. పలమనేరు నుంచి ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి లేదంటే ఆయన సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. శ్రీకాళహస్తికి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరు వినిపిస్తోంది. అయితే ఎస్సీవీ ఇప్పటికే టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకవేళ అక్కడ టికెట్టు దొరక్కపోతే కిరణ్‌పార్టీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలతోపాటు రిజర్వుడు నియోజకవర్గాలైన పూతలపట్టు, గంగాధరనెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులే దిక్కు కావచ్చు. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కూడా క్లిష్టమేనని కిరణ్ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కిరణ్ కొత్త పార్టీ నిర్ణయం వెల్లడి తరువాత జిల్లాలో పెద్దగా స్పందన లేదు. తిరుపతి, పీలేరు కేంద్రాల్లో ఆయన సన్నిహితులు కొందరు రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చారు.
 
 ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వదిలి...
 రాజకీయపార్టీలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతిని వేదిక చేసుకోవడం పలు సందర్భాల్లో చూస్తున్నాం. అయితే ఇదే జిల్లాకు చెం దిన కిరణ్ కొత్త పార్టీ ఆవిర్భావ సభకు రాజమండ్రిని ఎంపిక చేసుకోవడం విశేషం. సభ ఏర్పాటుకు సమయం తక్కువగా ఉండడంతో జనసమీకరణ బాధ్యత తన భుజస్కంధాలపై లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు