మిగిలింది సీఎం ఒక్కరే!

18 Feb, 2014 01:49 IST|Sakshi

*  ‘సాక్షి’ చెప్పినట్లు సీఎం పేషీ ఖాళీ
*  కీలక శాఖలకు అధికారుల బదిలీ
*  సీఎం ప్రెస్ కార్యదర్శి సత్యారావు
* ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా నియామకం
*  ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లం
*  జెన్‌కో ఎండీగా శంషీర్ సింగ్ రావత్
*  సాగు నీటి శాఖకు జవహర్‌రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం ఖాళీ అయింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. ఆయన కూడా మంగళవారం సాయంత్రంలోగా పదవికి  రాజీనామా చేయనున్నారు. ‘సాక్షి’ ఇంతకు ముందే చెప్పిన విధంగా సోమవారం ముఖ్యమంత్రి తన పేషీలోని అధికారులను కీలకమైన శాఖలకు బదిలీ చేశారు. తెలంగాణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చకు రాగానే గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైన ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. తన పేషీలోని అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు.
 
 

 

 

 

 

 

 

 

ఎమ్మార్ కేసులో అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలంటూ సీబీఐ కోరిన ఫైలును తిరస్కరిస్తూ సంతకం చేశారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఫైళ్లను కూడా తిరస్కరిస్తూ శాఖాపరమైన విచారణలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శి జవహర్‌రెడ్డిని సాగు నీటి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎన్. శ్రీధర్‌ను రాష్ర్ట బ్రూవరీస్, డిస్టిలరీస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ముఖ్యమంత్రి ఓఎస్‌డీగా పనిచేస్తున్న ఎం.సురేందర్‌ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా బదిలీ చేశారు. సీఎం ప్రెస్ కార్యదర్శి ఎ.సత్యారావును రాష్ట్ర ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా నియమించారు. సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లంను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్‌ను జెన్‌కో ఎండీగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. సీఎం మంగళవారం రాజీనామా చే సే వరకు ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రి పేషీలో కొనసాగుతారు. సోమవారం జరిగిన మరికొందరు ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలివీ..

మరిన్ని వార్తలు