సీఎం దొంగ దెబ్బ

13 Sep, 2013 04:53 IST|Sakshi

కండలేరు జలాశయం
 నుంచి పది టీఎంసీలను చిత్తూరు జిల్లాకు తాగునీటి పేరుతో తరలించేందుకు సీఎం కిరణ్ అత్యవసరంగా జీఓ జారీచేసి ఇక్కడి రైతాంగాన్ని దొంగదెబ్బ తీశారు. యుద్ధప్రాతిపదికన నీటి తరలింపునకు ప్రాజెక్టుకు అవసరమైన రూ.4300 కోట్లు బడ్జెట్ కేటాయింపునకు సర్కార్ ఆమోదం తెలిపింది. మన వేలితో మన కంటినే పొడిచిన చందంగా జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఆనం ఈ మొత్తాన్ని విడుదల చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
 
 సాక్షి, నెల్లూరు : జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి 10 టీఎంసీల నీటిని చిత్తూరు జిల్లాకు తరలించేందుకు ప్రభుత్వం తాజాగా జీఓ జారీ చేసినట్టు తెలిసింది. చిత్తూరు జిల్లాకు తాగునీరు పేరుతో తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నీటి తరలింపు ప్రాజెక్టుకు అవసరమైన రూ.4300 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు కిరణ్ సర్కార్ ఆమోద ముద్రవేసినట్టు సమాచారం. ఈ పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ఇప్పటికే రూ.2 వేల కోట్లు బడ్జెట్ కేటాయింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.  
 
 త్వరలో బడ్జెట్ కేటాయింపు తంతు పూర్తికానుంది. నేడో రేపో  పనులు మొదలు పెట్టనున్నారు. కండలేరు నుంచి పది టీఎంసీ ల నీటిని చిత్తూరు జిల్లాకు తరలిస్తే జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోనుంది. కండలేరు పరిధిలోని దాదాపు  3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు. సోమశిల పరిధిలోనూ నీటి కష్టాల తప్పవు. లక్షలాది ఎకరాలు బీళ్లు కానున్నాయి. ఇప్పటికే కండలేరు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తిలకు సాగునీరు అందిస్తున్న విషయం విదితమే. కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కండలేరు నుంచి చిత్తూరుకు నీటిని తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కండలేరు నుంచి చిత్తూరు, పీలేరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి, పుంగనూరు  ప్రాంతాలకు తాగునీటిని తరలించేం దుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
 
 68 టీఎంసీల సామర్థ్యం కలిగిన కండలేరు నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు తరలించాల్సి ఉంది. మరో వైపు సోమశిల నిండితేనే కండలేరుకు నీరు వచ్చే పరిస్థితి. కృష్ణా జలాలే ప్రధాన ఆధారం.పోతిరెడ్డిపాడు నుంచి  వెలిగోడు రిజర్వాయర్ మీదుగా పెన్నానది నుంచి సోమశిలకు నీరు చేరాల్సి ఉంది. ఎగువన సక్రమంగా వర్షాలు కురవక పోతే సోమశిలకు నీరు చేరే పరిస్థితి లేదు. వర్షాభావ పరిస్థితులు ఎ దురైతే సోమశిలతో పాటు కండలేరుకు నీరు చేరే పరిస్థితి ఉండదు. నాలుగైదేళ్లకోసారి కూడా  కండలేరు నిండే పరిస్థితి లేదు.
 
 ఈ నేపథ్యంలో పది టీఎంసీల నీటిని చిత్తూరు జిల్లా తాగునీటి అవసరాల కోసం తరలిస్తే కండలేరు పరిధిలో నెల్లూరు జిల్లా రైతులకు మొండిచేయి మిగులుతుంది. మరో వైపు సీఎం కిరణ్ కండలేరు నుంచి  నీటి తరలింపు తంతు ముగించి పంతం నెగ్గించుకున్నారు.  కండలేరు నుంచి నీటిని తరలిస్తున్నా జిల్లాకు చెందిన  మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రజా ప్రతినిధు లు కుక్కిన పేనులా నోరు మెదపలేదు. గతంలో కండలేరు నుంచి చుక్కనీరు చిత్తూరుకు తరలించినా చూస్తూ ఊరుకునేది లేదని, కణతకు తుపాకి పెట్టుకుని కాల్చుకుంటానని  డ్రామాలాడి, బీరాలు పలికిన మంత్రి ఆనం, ఆయన సోదరుడు వివేకా ఇప్పుడు నోరు మెదపక పోవడం వారి ద్వంద్వ వైఖరిని చాటుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపునకు తానే సాక్షీభూతంగా నిలవడం విశేషం. కండలేరు నీటిని చిత్తూరుకు తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి నా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఏ మాత్రం స్పందించక పోవడంపై జిల్లా రైతాంగం  ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.  కండలేరు  నుంచి పది టీఎంసీల నీటిని చిత్తూరుకు తరలిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసిన విషయం తమకింకా తెలియదని కొత్తగా వచ్చిన తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఒక వేళ జీఓ వచ్చినా తాము సమ్మెలో ఉండటం వల్లే తెలిసే అవకాశం లేదన్నారు.
 
 రహస్యంగా ఉత్తర్వులు
 ఇవ్వడం హేయం
 కండలేరు నీటి తరలింపునకు ప్రభుత్వం  రహస్యంగా ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని  రైతు సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చిరసాని కోటిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు బెజవాడ ఓబుల్‌రెడ్డి, అధ్యక్షుడు  వి.నిరంజన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పి. హనుమంతరావు, ఏవీఆర్‌నాయుడు, చిట్టమూరు ఆదిశేషారెడ్డి, సి.వరుణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సమైక్య నినాదంతో జిల్లా అట్టుడికి పోతున్న తరుణంలో  కండలేరు రిజర్వాయర్‌కు కన్నం పెట్టాలన్న దుర్బుద్ధి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
 
 ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కండలేరు నుంచి చిత్తూరు నీటిని తరలించేందుకు రూ.4300 కోట్లు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా  రైతాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆమోదించరని వారు హెచ్చరించారు. పది టీఎంసీల నీటితో  జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాలు సాగవుతుందని తెలిపారు. పెరుగుతున్న విస్తీర్ణానికి నీటిని అందించేందుకు పథకాలు రూపొందించాల్సింది పోయి ఉన్న కొద్ది నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించాలని చూడడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు.
 

మరిన్ని వార్తలు