కిరణ్ పక్కా విభజన వాది: గట్టు

4 Nov, 2013 00:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన జాలి మాటలన్నీ బూటకమని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఆయన నటిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. సమైక్యం ముసుగులో ఉన్న విభజనవాది కిరణ్ అని తూర్పారబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమాన్ని సీఎం కిరణ్ నీరుగారుస్తూ, విభజనకు తీవ్రంగా కృషి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య రాష్ట్రంలో దోబూచులాట జరుగుతోందని, ఆ రెండు పార్టీలు తమ వైఖరితో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
 
 వరదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ప్రజల నుంచి ఆదరణ లభించే సరికి పోలీసుల చేత అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం 300 మంది పోలీసులతో ప్రత్యేకమైన భద్రత మధ్య రెడ్‌కార్పెట్ వేసి తీసుకెళ్లారని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు మీద కాంగ్రెస్‌కు ఎందుకింత ప్రేమో ప్రజలందరికీ తెలుసన్నారు. సమైక్య రాష్ట్రంలో జీతాలు తీసుకుంటున్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరుపట్ల తాను వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పౌరహక్కులను కాలరాసిన ఇద్దరు మంత్రులను సీఎం ఎందుకు భర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని చూస్తే కిరణ్ ఎంత విభజన వాదో స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు