సీఎం హిట్ వికెట్

15 Nov, 2013 11:44 IST|Sakshi
సీఎం హిట్ వికెట్

* సమైక్యవాది అనిపించుకునే యత్నంలో సీఎం సెల్ఫ్‌గోల్
* విభజనకు నిరసనగా ఢిల్లీ పర్యటన వాయిదా అంటూ సొంత చానల్‌లో ప్రచారం
* అధిష్టానాన్ని ధిక్కరించి జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ కథనాలు
* బాలల దినోత్సవంలో పాల్గొనాల్సి ఉండడం వల్లే సీఎం ఢిల్లీ రాలేదని బయటపెట్టిన షిండే
 హోంమంత్రి ప్రకటనతో ఫెయిలైన సీఎం ప్లాన్
 
సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికరవనున్న సీమాంధ్రలో సమైక్య హీరో అనిపించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ దఫా తన మంత్రివర్గ సహచరుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసి పావులు కదిపారు. గురువారం సీఎం జీవోఎం ముందు హాజరై ప్రభుత్వ పరంగా విభజనపై పలు అంశాలను వివరించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ బాలల చలనచిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవం ఉన్న కారణంగా కేంద్ర మంత్రికి సమాచారం ఇచ్చి ఆయన పర్యటన 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు.

అయితే సమైక్యం కోసం కట్టుబడి ఉన్నందునే సీఎం జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ తన సొంత టీవీ చానల్‌లో ప్రచారం మొదలుపెట్టారు. భేటీకి రాకుండా అధిష్టానాన్ని ధిక్కరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చి ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను కూర్చోబెట్టాలని పెద్దలు నిర్ణయించారంటూ ఆయన సన్నిహితులతో లీకులిప్పించారు. తద్వారా కన్నాను దెబ్బతీయడంతోపాటు తనకుతానుగా సమైక్యం కోసం కట్టుబడి ఉన్నట్టుగా చిత్రీకరించుకునే వ్యూహంతో కిరణ్‌కుమార్ రెడ్డి ముందుకువెళ్లారు.

అయితే ముఖ్యమంత్రి జీవోఎం ముందు హాజరుకాకపోవడానికి బాలల చలనచిత్రోత్సవ కార్యక్రమమే కారణమని స్వయంగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన చేయడంతో కిరణ్ ప్లానంతా ఫెయిలైంది. షిండే ప్రకటనతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిని ఇదంతా కిరణ్ ఒక ఎత్తుగడ ప్రకారం చేసిన డ్రామాయేనని సాయంత్రానికి తేల్చుకున్నారు.

ఉదయం నుంచి సాయంత్రందాకా లీకులే లీకులు..
రాష్ట్ర విభజనపై తమ ముందుకు రావలసిందిగా కిరణ్‌ను జీవోఎం ఆదేశించినట్లు, గురువారం రాత్రి 8 గంటలకు సమయాన్ని ఖరారు చేసినట్లు బుధవారమే సీఎం కార్యాలయవర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు కూడా బుధవారం ప్రకటించారు. అయితే గురువారం ఉదయానికే సీన్ మారిపోయింది. సీఎం కిరణ్ జీవోఎం ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడం లేదని టీవీ చానళ్లకు లీకులు అందాయి. దాంతో పాటు సొంత చానల్‌లో అదే విషయాన్ని ఊదరగొట్టారు.

మంత్రుల బృందం రాష్ట్ర విభజన సమస్యలపై ఏర్పడినందున దాని ముందు హాజరుకావడమంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని, అందుకే సీఎం కిరణ్ ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారని వ్యూహాత్మకంగా ప్రచారం చేయించారు. సమైక్యవాదం కోసం అధిష్టానాన్ని, కేంద్రమంత్రుల బృందాన్నీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎదిరించి నిలబడుతున్నారన్న కలరింగ్ ఇప్పించారు.

ఒకే దెబ్బకు ‘కన్నా’ వికెట్ కూడా..
కన్నా లక్ష్మీనారాయణ మూడు రోజుల కిందట సోనియాగాంధీని కలిసిన నేపథ్యంలో దీనిపైనా సీఎం ప్రచారాన్ని సాగించారు. సమైక్యవాదిగా సీఎం ధిక్కారస్వరం తీవ్రమైందని, అందుకే జీవోఎంకు వెళ్లడం లేదని, ఆయన్ను మార్చాలన్న ఆలోచనతోనే సోనియాగాంధీ స్వయంగా కన్నాను పిలిచి మాట్లాడారన్న కథనాలు ప్రసారమయ్యేలా చేశారు. నిజంగానే సీఎం అధిష్టానాన్ని, కేంద్రాన్ని ధిక్కరించే ఢిల్లీకి వెళ్లడం లేదా? అన్న అనుమానం వచ్చిన కొంతమంది తెలంగాణ నేతలు దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు.

ఈనెల 25వ తేదీకి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్య వాదం వినిపిస్తున్న కారణంగానే కిరణ్‌ను మార్చాలన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టుగా ఆయనకు ఆయనే ప్రచారంలో పెట్టించడంతో పాటు ఇటీవలి కాలంలో తనకు దూరమైన కన్నా లక్ష్మీనారాయణను విభజన వాదిగా ముద్రవేయాలన్న ప్రణాళికబద్ధంగా ఇదంతా చేశారని కాంగ్రెస్‌లో గుప్పుమంటోంది.

జీవోఎం సమయమే కేటాయించలేదు: యాదవరెడ్డి
మంత్రుల బృందం కిరణ్‌కు గురువారం సమయమే కేటాయించలేదని జీవోఎం అధికారులు తమకు చెప్పారని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ యాదవరెడ్డి మీడియాకు చెప్పారు. మరికొందరు నేతలూ ఇదే అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున సీఎం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు వీలుగా భేటీని వాయిదా వేయాలని కేంద్ర మంత్రే జీవోఎంకు లేఖ రాశారని, ఆ కారణంగానే సీఎం ఢిల్లీ పర్యటన 18కి వాయి దా పడిందని సాయంత్రానికి సీఎంవో మీడియాకు వివరణ ఇచ్చింది.

సీఎం మార్పు ఉండదు: మంత్రులు
తాజా కథనాలపై సీఎం సన్నిహిత మంత్రులు కూడా వేర్వేరుగా స్పందించారు. సీఎంను మార్చడం అంత సులభమైన విషయం కానేకాదని, విభజన నిర్ణయంతో ఇప్పటికే ఒక తప్పుచేసిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుతో మరో తప్పు చేయబోదని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానైనా తప్పుకోవాలని, శాసనసభాపక్ష సమావేశం పెట్టయినా నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు.

శాసనసభాపక్ష సమావేశంలో ఏక వాక్య తీర్మానంతో సీఎం ఎంపిక కుదరబోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సమయంలో ఎవరు ఢిల్లీకి వెళ్లినా సీఎం మార్పు జరుగుతుందనే ప్రచారం సాధారణమైపోయిందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ హైదరాబాద్‌కు రావడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని మరో మంత్రి శైలజానాథ్ తెలిపారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ప్రచారం మీడియాలోనే జరుగుతోందని, తమకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని స్పష్టంచేశారు.
 
నా ప్రతిష్టను దెబ్బతీయడానికే: కన్నా
తనపై జరిగిన ప్రచారాన్ని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. తాను సమైక్యవాదినేనని, అధిష్టానంతో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివెనుక ఎవరున్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా జరిగిందన్నారు.

>
మరిన్ని వార్తలు