ఇక అమీతుమీ

22 Jan, 2014 03:44 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, విజయనగరం :   కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. వారి వైరం అమీతుమీ తేల్చుకునే పరిస్థితికి దారి తీస్తోంది. ఈ మేరకు ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమైనట్టు స్పష్టమవుతోంది. పార్టీ శ్రేణులు కూడా ఇదేరకంగా అభిప్రాయపడుతున్నాయి. అధిష్టానం వద్ద తనను బదనాం చేసిన వైరిచర్లకు జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఉందని చూపించేం దుకు బొత్స వర్గం పావులు కదపగా, పెద్దల సభకు ప్రయత్నిస్తున్న బొత్సకు హస్తినలో తనకున్న పలుకుబడితో చెక్ పెట్టే యోచనలో వైరిచర్ల ఉన్నట్టు తెలుస్తోంది. 
 పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి బొత్సను కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ టార్గెట్ చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా బొత్సను ఎండగడుతూ వస్తున్నారు. ఒక్క ఆరోపణలు, విమర్శలతోనే కాకుండా బొత్స వ్యవహార శైలీ, దందాపై అధిష్టానానికి లేఖ రాసిమరీ  వివరించారు. 
 
 పవర్ ప్లాంట్‌కు వత్తాసుపలుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని, మద్యం సిండికేట్ దందా నడుపుతున్నారని, భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని అధిష్టానాకి లేఖలు పంపారు. అలాగే హస్తినలో తనకు సన్నిహితులైన వారి వద్ద బొత్స వైఖరిని దుయ్యబడుతూ వస్తున్నారు. దీన్ని బొత్స సహించలేకపోతున్న విషయం తెలిసిందే. కాకపోతే అధిష్టానంతో నేరుగా సంబంధాలు నెరిపే వైరిచర్లపై ప్రత్యారోపణలు చేయడం తప్ప బొత్స ఏమీ చేయలేకపోయారు. చెప్పాలంటే వైరిచర్ల ఎటాక్ తగ్గట్టుగా బొత్స సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో మైండ్‌గేమ్‌కు బొత్స తెర లేపినట్టు తెలుస్తోంది. 
 
 ఆక్రమంలోనే వైరిచర్ల వర్గీయులను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారన్న వాదనలొచ్చాయి. పార్వతీపురం డివిజన్‌లో ఆదిపత్యం కోసం అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారని కొంత కాలంగా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విధంగా సమయం కోసం వేచి చూసిన బొత్స వ్యూహాత్మకంగానే తన వర్గాన్ని ఉసిగొల్పి సోమవారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగి న అరకు ఎంపీ అభ్యర్థి ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకంగా మాట్లాడించినట్టు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తనను బదనాం చేస్తున్న వైరిచర్లకు జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఉందని, సీటు ఇస్తే పార్టీకి నష్టమని చెప్పే ప్రయత్నం చేయించారు. 
 
 అధిష్టానం వద్ద వైరిచర్ల ప్రాధాన్యం తగ్గించడానికి వేసిన ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నా యి. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనించిన వైరీ వర్గీయులు పూసగుచ్చినట్టుగా వైరిచర్ల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో తనకు వ్యతిరేకంగా గళం విప్పడం వెనక బొత్స హస్తం ఉందని హస్తినలో తన వేగుల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పనిలో కిషోర్ నిమగ్నమైనట్టు తెలిసింది. అంతేకాకుండా తనను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్న బొ త్సకు రాజకీయంగా చెక్ పెట్టే యోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా పెద్దల సభ కోసం బొత్స చేసే ప్రయత్నాలకు, భవిష్యత్‌లో హస్తిన లాబీయింగ్‌తో రాజకీయాలు శాసించాలన్న యత్నాలకు గండికొట్టే విధంగా వైరిచర్ల పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందన్నదానిపై ఉత్కంఠ మొదలైంది.
 
మరిన్ని వార్తలు