కాంగ్రెస్ అధిష్టానానికి కిశోర్‌చంద్రదేవ్ లేఖలు

12 Sep, 2013 02:59 IST|Sakshi
కాంగ్రెస్ అధిష్టానానికి కిశోర్‌చంద్రదేవ్ లేఖలు

తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం చేపట్టిన ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బుధవారం లేఖలు రాశారు. రాష్ట్ర విభజనతో నష్టపోతామని వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంతో ఒకటిన్నర మాసాలుగా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం పూర్తిగా స్థంభించిపోయాయని వివరించారు.

ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను లేఖలో ప్రస్థావించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఆంటోనీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు మంత్రి విడివిడిగా లేఖలు రాశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఎన్జీవో సంఘం నేతలు ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలూ చేయలేదని, హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగమైన ఎన్జీవోల సభ విజయవంతం కావడం మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు, విభజనపై వారిలో వ్యక్తమవుతున్న భయాందోళనలకు అద్దం పట్టిందని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
 

>
మరిన్ని వార్తలు