సహజసిద్ధమైన మోకాలుకు ప్రత్యామ్నాయం ‘అట్యూన్’

24 May, 2014 00:59 IST|Sakshi
సహజసిద్ధమైన మోకాలుకు ప్రత్యామ్నాయం ‘అట్యూన్’

తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: జాయింటు రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలు అవసరమయ్యే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ‘అట్యూన్’ ద్వారా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో తాడేపల్లి మణిపాల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ఒక విప్లవాత్మకమైన విధానానికి నాంది పలికిందని మణిపాల్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణుడు నల్లమోతు జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం మణిపాల్ ఆసుపత్రిలో ‘అట్యూన్’ ఇంప్లాంట్‌ను ఉపయోగించి జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

 ‘అట్యూన్’ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన విధానమని, దీని ద్వారా ముఖ్యమైన, సహజసిద్ధమైన ఎముకలోని చాలా భాగాన్ని, లిగ్మెంట్స్, కణజాలాన్ని అందేలా ఉంచడం జరుగుతుందని, దాని వలన ఎముకలు దీర్ఘకాలం ఇబ్బందికి గురికాకుండా ఉంటాయని తెలిపారు. సాధారణ మోకాలు జాయింటు లాగా అట్యూన్ అదనపు ఎముక నష్టం లేకుండా 140 నుంచి 150 డిగ్రీలలో మడవ వచ్చని తెలిపారు.

 గతంలో మోకాలు శస్త్రచికిత్స కోసం వినియోగించిన ఇంప్లాంట్స్ కేవలం 8 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే పని చేసేవని, కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూపొందించిన అట్యూన్ 30 సంవత్సరాలు పని చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో యువకులు సైతం మోకాలు నొప్పులతో ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన ఆ కంపెనీ 30 సంవత్సరాలపాటు మనగలిగే ఈ అట్యూన్‌ను రూపొందించిందన్నారు.

 అట్యూన్‌ను కేవలం ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులకు మాత్రమే జాన్సన్ కంపెనీ సరఫరా చేస్తుందని, మొదటి దశలో దేశవ్యాప్తంగా కేవలం అట్యూన్ శస్త్ర చికిత్స నిమిత్తం 12 మంది వైద్యులకు మాత్రమే శిక్షణ ఇచ్చారని, వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి తాను శిక్షణ పొందినట్టు డాక్టర్ జగదీష్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు