వలస కూలీలకు అండగా ఉన్నాం

12 Apr, 2020 03:51 IST|Sakshi

ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచాం

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ: రాష్ట్రానికి పనుల కోసం వచ్చి లాక్‌డౌన్ కారణంగా ఇక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ రోల్‌మోడల్‌గా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 393 సహాయక శిబిరాల్లో 21,025 మంది వసతి పొందుతున్నారని చెప్పారు.

వీరిలో మన రాష్ట్రానికి చెందిన వారు 12,820 మంది కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8,205 మంది ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వారికి పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అధికారులు అందిస్తున్నారని తెలిపారు. శిబిరాల్లో భౌతికదూరం పాటించేలా పడకలు ఏర్పాటు చేశారని, వీరికి  ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నారని వివరించారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆరోగ్య బృందాలు ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారని ఈ బృందాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కొడాలి నాని కోరారు. 

మరిన్ని వార్తలు