భక్తి, బాధ్యతతో తిరునాళ్ల కోసం పనిచేయాలి

23 Jan, 2018 19:39 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సభాపతి డాక్టర్‌ కోడెల

కోటప్పకొండ తిరునాళ్ల సమీక్షా సమావేశం

పాల్గొన్న సభాపతి డాక్టర్‌ కోడెల, కలెక్టర్‌ శశిధర్, రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు

నరసరావుపేట రూరల్‌: భక్తి, బాధ్యతలతో అధికారులు పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన మహశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల ఏర్పాట్లుపై సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభాపతి డాక్టర్‌ కోడెలతో పాటు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, రూరల్‌ ఎస్పీ డాక్టర్‌ అప్పలనాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. కోడెల మాట్లాడుతూ రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటప్పకొండ పర్యటనకు రానున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ త్రికోటేశ్వరుని ఆలయం జిల్లాలో ఉండడం అదృష్టమన్నారు. రూరల్‌ ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల జరిగే విధంగా అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడతామని తెలిపారు.
 

గత బకాయిలు చెల్లించలేదు...
తిరునాళ్ల ఏర్పాట్ల కోసం గతంలో తాము చెసిన ఖర్చులను ఇప్పటి వరకు చెల్లించలేదని పలు శాఖల అధికారులు సమావేశంలో సభాపతి, కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్‌అండ్‌బీకి రూ.9లక్షలు, ఆర్‌డబ్లూఎస్‌కు రూ.7.5లక్షలు, విద్యుత్‌ శాఖకు రూ.5లక్షలు, ఆర్టీసీకి రూ.3.5లక్షల మేరకు బకాయిలు ఉన్నట్టు అయా శాఖల అధికారులు సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లను రాష్ట్ర పండుగుగా ప్రకటించినందున రూ.50 లక్షలు విడుదల చేస్తుందని ఇందులో అయా శాఖలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని సభాపతి డాక్టర్‌ కోడెల తెలిపారు.
 

రైల్వే శాఖ డబ్బులు చెల్లించాలి అంటుంది
కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట మార్గంలోని ఈటీ సమీపంలో ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌లైన్‌లో ప్రభల రాక, పోకల సందర్భంగా సరఫరా నిలిపివేస్తారు. దీనివలన వినుకొండ పట్టణంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుంది. నూతనంగా రైల్వే లైన్‌ విద్యుదీకరించడంతో వినుకొండ నుంచి రైల్వేకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. ప్రభల రాక సందర్భంగా విద్యుత్‌ నిలిపివేయాలంటే గంటకు రూ.5 లక్షలు చెల్లించాలని రైల్వే అధికారులు తెలిపినట్టు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జయభారతరావు తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు 332 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డీఎం అబ్దుల్‌సలీం తెలిపారు.  ఆర్డీవో జి.గంగాధర్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, ఈవో వై.బైరాగి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు