తల్లి సంరక్షణకు గౌతమ్

27 Sep, 2014 00:35 IST|Sakshi

కోడెల కోడలు పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మనవడు గౌతమ్‌ను అతడి తల్లి పద్మప్రియ సంరక్షణలోనే ఉంచుతూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలిసుండేందుకు పద్మప్రియ, ఆమె భర్త శివరామకృష్ణ అంగీకరించిన నేపథ్యంలో విశాఖపలో తగిన ఇల్లు చూసుకుని ఉండాలని, అధిక బరువు (ఓబేసిటీ)తో బాధపడుతున్న గౌతమ్‌కు విశాఖలోనే చిన్నపిల్లల డాక్టర్ వద్ద చికిత్స అందించాలని పేర్కొంది. గౌతమ్‌ను చూసేందుకు (పద్మప్రియ తండ్రి)ని అనుమతించాలని దంపతులకు స్పష్టం చేసింది.అతని తండ్రి శివరామకృష్ణను అత్తమామలు కాని, భార్య కాని నిరోధించడానికి వీల్లేదని పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలుకు అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ‘నా కొడుకును భర్త కిడ్నాప్ చేశారు.అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించండి’ అంటూ పద్మప్రియ  హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే. కోడెల ఇంట్లో ఉన్న గౌతమ్‌ను కోర్టు ఆదేశంతో శుక్రవారం ఏపీ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ గౌతమ్‌ను కోర్టు ముందుకు తీసుకొచ్చారు.
 

>
మరిన్ని వార్తలు