క్యాంపస్‌ కోడెల అధికార దుర్వినియోగం

2 Sep, 2019 09:01 IST|Sakshi
యూనివర్సిటీ పరిపాలనా భవనం 

సాక్షి, ఏఎన్‌యూ(గుంటూరు) : గౌరవ ప్రదమైన స్పీకర్‌ స్థానంలో ఉండి కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన బంధువుగా చెప్పుకునే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లైబ్రేరియన్‌ డాక్టర్‌ కోడెల వెంకటరావు యూనివర్సిటీలో అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడ్డారనే అంశం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు రాష్ట్రంలో చక్రం తిప్పారు. కే–ట్యాక్స్‌ల పేరుతో అమాయక జనాన్ని పట్టిపీడించారు. పశువుల గడ్డి నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ వరకూ దేన్ని వదలకుండా దోచేశారు. అన్న కుటుంబం రాష్ట్రంలో దోచేస్తోంది. నేనెందుకు ఊరికే ఉండాలి అనుకున్నాడే ఏమో మరి ఏఎన్‌యూలోని లైబ్రేరియన్‌ కోడెల వెంకట్రావు. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. విలువలు, సిద్ధాంతాల్లో సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన యూనివర్సిటీని సొంత సామ్రాజ్యంలా మార్చుకుని పలు అక్రమాలకు తెరతీశారని పలువురు ఆరోపిస్తున్నారు. 

ఇష్టారాజ్యంగా..
యూనివర్సిటీలో లైబ్రేరియన్‌ అయిన కోడెల వెంకట్రావు కోడెల శివప్రసాదరావుకు వరుసకు తమ్ముడు. ఈయన యూనివర్సిటీలో పలు అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇందుకు యూనివర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం, మాజీ స్పీకర్‌ కోడెల నుంచి పూర్తి సహకారం అందిందని పలువురు ఆరోపిస్తున్నారు. లైబ్రేరియన్‌ల డిజిగ్నేషన్స్‌ను ప్రొఫెసర్‌గా మార్చుతూ రీ డిజిగ్నేషన్స్‌ కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడెలకు ప్రొఫెసర్‌గా రీ డిజిగ్నేషన్‌ కల్పిస్తూ 2011లో అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాని ఆయన వేతనం, సర్వీస్‌ కండీషన్స్‌లో ఎలాంటి మార్పు ఉండదని అందులో పేర్కొన్నారు. కాని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పాలకమండలి(ఈసీ)లో యూనివర్సిటీ టీచర్ల కోటాలో కోడెలను సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది.

టీచర్‌ కాని వ్యక్తిని టీచర్ల కోటాలో ఈసీ మెంబర్‌గా నియమించడంపై అప్పట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డాక్టర్‌ కోడెల వెంకటరావు అధ్యాపకుడా కాదా అనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతుంటే మూడున్నరేళ్ల కిందట ఆయనకు అధ్యాపకుడి కోటాలో ఈసీ సభ్యత్వం ఇవ్వడం, అప్పటి యూనివర్సిటీ పాలకులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. ఈ అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగానే మిగిలింది. ఎప్పుడో మూసేసిన లైబ్రరీ సైన్స్‌ విభాగాన్ని తాను ఈసీ మెంబర్‌గా నియమితుడైన తర్వాత 2017లో మరలా ప్రారంభించేందుకు పాలకమండలిలో ఆమోదింపజేసుకున్నాడు. తాను అధ్యాపకుడిని అనిపించుకునేందుకే ఆయన లైబ్రరీ సైన్స్‌ విభాగాన్ని ప్రారంభించాడనే విమర్శలూ ఉన్నాయి.

సెల్ఫ్‌ డిక్లేర్డ్‌ హెడ్‌గా..
పాలకమండలి సభ్యుడిగా చక్రం తిప్పి ఎంఎల్‌ఐఎస్సీ విభాగానికి అనుమతి తెచ్చుకున్న డాక్టర్‌ కోడెల వెంకటరావు ఆ విభాగానికి మూడేళ్లకు పైగా సెల్ఫ్‌ డిక్లేర్డ్‌ హెడ్‌(స్వయం ప్రకటిత విభాగాధిపతి)గా చక్రం తిప్పాడు. ఏ విభాగంలోనైనా రెగ్యులర్‌ అధ్యాపకుడు మాత్రమే ఆ విభాగానికి అధిపతిగా వ్యవహరించే నిబంధనలు ఉన్నాయి. కాని లైబ్రేరియన్‌న్‌డాక్టర్‌ కోడెల ఎంఎల్‌ఐఎస్సీ విభాగంలో గెస్ట్‌ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడు)గా పనిచేస్తూ రెమ్యునరేషన్‌ తీసుకుంటూ అదే విభాగానికి హెడ్‌గా వ్యవహరించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రెగ్యులర్‌ అధ్యాపకులు లేని విభాగానికి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను విభాగాధిపతిగా నియమించాల్సిన ఉన్నతాధికారులు ఏ విధమైన ఉత్తర్వులు లేకుండానే ఆ విభాగాన్ని పాలించుకోమన్నట్లు అప్పజెప్పారు. దీంతో ఎంఎల్‌ఐఎస్సీలో అతిథి అధ్యాపకుల నియామకంలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి.

నేటికీ అదే తీరు..
అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల వెంకట్రావు చేసిన అధికార దుర్వినియోగానికి టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అండదండలు అందించిందని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు మాత్రం నేటికీ ఆయనకు పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నారని విమర్శలూ ఉన్నాయి. కేవలం ప్రొఫెసర్‌ హోదా మాత్రమే ఉన్న ఈయనకు సర్వీస్‌ విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదని, నిబంధనల్లో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం, రీ డిజిగ్నేషన్స్‌ తర్వాత కూడా అధ్యాపకేతర ఉద్యోగులు తీసుకునే సరెండర్‌ లీవ్స్‌ను ఎన్‌క్యాష్‌ మెంట్‌ చేసుకోవడం వంటివి జరిగినా న్యాయస్థానాల్లో వాటిని యూనివర్సిటీ బలంగా చూపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. కోడెల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ఇప్పటికే కొందరు లోకాయుక్తను ఆశ్రయించగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై డాక్టర్‌ కోడెల వెంకటరావును వివరణ కోరగా నేను దీనిపై స్పందించనని స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా