కోడెల.. ఇంత కక్కుర్తా?

28 Aug, 2019 08:02 IST|Sakshi
కోడెల శివరామ్‌ షోరూమ్‌లో సీజ్‌ చేసిన ఫర్నిచర్‌ను తరలిస్తున్న పోలీసులు

ఎటువంటి అనుమతులూ  లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్‌ను  తెచ్చుకున్న కోడెల

రూ.70 లక్షల డైనింగ్‌ టేబుల్‌ నుంచి ప్లాస్టిక్‌ కుర్చీ వరకు వదల్లేదు

శివరామ్‌ షోరూమ్‌లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

అన్న క్యాంటీన్‌ భోజనం, పశువుల దాణానూ వదలని కోడెల కుమార్తె

శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడుబండిపై ఆధారపడిన చిరువ్యాపారి నుంచి బడా కాంట్రాక్టర్‌ వరకు కే–ట్యాక్స్‌ వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుంది. పేదల ఆకలి తీర్చాల్సిన అన్న క్యాంటీన్‌ భోజనాలను కోడెల కుమార్తెకు చెందిన సేఫ్‌ కంపెనీ కార్మికులకు విక్రయించి సొమ్ముచేసుకుంది. చివరికి మూగజీవాల ఆకలి తీర్చాల్సిన గడ్డినీ వదల్లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తరలించి కుమారుడి షోరూమ్‌లో వాడుకున్నారు. రూ.లక్షల విలువచేసే డైనింగ్‌ టేబుల్‌ నుంచి నాలుగైదు వందల రూపాయల విలువ కూడా చేయని ప్లాస్టిక్‌ కుర్చీ వరకూ వదలకుండా అక్రమంగా తరలించుకున్నారు. అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాక, ఫర్నిచర్‌ అప్పగిస్తానంటూ కోర్టును ఆశ్రయించిన కోడెల శివప్రసాద్‌ తీరును చూసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. 

సాక్షి, గుంటూరు: శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబ సభ్యుల కక్కుర్తిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్‌ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్‌ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజవకర్గాలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తన కుమారుడి షోరూమ్‌కు తరలించిన విషయం తీవ్ర దుమారం రేపింది.

ఈ వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు కోడెల శివప్రసారావుపై సెక్షన్‌ ఐపీసీ సెక్షన్‌ 409, ఆయన కుమారుడు శివరామకృష్ణ (శివరామ్‌)పై 414 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుంటూరు నగరంలోని శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హీరో షోరూమ్‌లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్‌ చేశారు. అసెంబ్లీ అధికారుల అనుమతి మేరకే పాత అసెంబ్లీలో ఫర్నిచర్‌కు భద్రత దృష్ట్యా తన కార్యాలయాలకు తరలించానని కోడెల బుకాయిస్తూ వచ్చారు. అయితే కోడెల కుమారుడి షోరూమ్‌లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ అనధికారికంగా తరలించారని అధికారులు నిగ్గు తేల్చారు.

ప్లాస్టిక్‌ కుర్చీలను వదల్లేదు..
అప్పనంగా వస్తున్నాయనే ఉద్దేశంతో రూ.70 లక్షల ఖరీదైన డైనింగ్‌ టేబుల్‌ నుంచి వందల రూపాయల విలువసేజే ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా వదలకుండా కుమారుడి షోరూమ్‌కు కోడెల తరలించారు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివరామ్‌ దర్జాగా షోరూమ్‌లో రెండేళ్లు వినియోగించుకున్నారు. ఆఖరికి అసెంబ్లీ నుంచి తెచ్చిన పెన్నూ పేపర్లు కూడా శివరామ్‌ షోరూమ్‌లో వినియోగించారని అక్కడ పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. ప్లాస్టిక్‌ కుర్చీలను వదలకుండా షోరూమ్‌లో తెచ్చిపెట్టుకున్న కోడెల కక్కుర్తిని తలుచుకుని వారి సిబ్బందే నవ్వుకుంటున్నారు.

గతంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి అన్నా క్యాంటీన్‌లో పేదల ఆకలి తీర్చాల్సిన భోజనాన్ని తన సేఫ్‌ కంపెనీకి తరలించి అక్కడ పనిచేసే కార్మికులకు విక్రయించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గడ్డిలోనూ ఆమె అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలను మర్చిపోకముందే అసెంబ్లీలోని ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా వదలకుండా తెచ్చుకున్నారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల కుటుంబం కక్కుర్తి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనని చర్చించుకుంటున్నారు. అధికారులు ఇంకా కోడెల కార్యాలయాలు, నివాసాల్లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్‌ చేయలేదు. కొంత ఫర్నిచర్‌ గుంటూరులోని కోడెల కుమార్తె నివాసంలోనూ ఉందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు