కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం

1 Oct, 2019 12:32 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. కోడెల పదవిలో ఉండగా కే ట్యాక్స్‌ పేరిట శివరాం కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు కేసుల విషయమై తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది.

ఈ క్రమంలో కోడెల శివరాం ఈరోజు నరసరావుపేట ఫస్ట్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు. కాగా కే ట్యాక్స్‌ పేరిట భారీ ఎత్తున ప్రజలు కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం తనను పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు